అలా అలా మా ఆర్టీసీ యాత్రలు సాగిపోతుండేవి. ఇంతలో హీరో పుట్టినరోజు వచ్చింది. తన పుట్టినరోజు కి బామ్మ వాళ్ళూరు వెళ్ళాను. ఇక రేపు పుట్టినరోజనగా హీరో గారి సణుగుడు మొదలు.అర్ధరాత్రి 12 గంటలకి మీ బామ్మ వాళ్ళింటి పైకి రా,నేను కేక్ తీసుకొస్తాను. కట్ చేస్తా నీతో కలిసి అని. ఇది అయ్యే పనేనా చెప్పండి ఒక అమ్మాయికి,ఇంట్లో వాళ్ళకి తెలీకుండా అర్ధరాత్రి తలుపు తీసుకుని మేడ పైకి వెళ్ళడం.
వద్దు అన్నాను అని అలిగాడు నా మీద. అయినా పట్టించుకోలేదు, రానంటే రాను అని ఖచ్చితం గా చెప్పాను. మొత్తానికి అలక మొహం తోనే పొద్దున్నే మా ఇంటికి వచ్చాడు. మొహం చూస్తే జాలేసింది కానీ. హమ్మో, ఆ విషయం తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది,ఒకవేళ నేను మేడ మీదకి వెళ్ళి ఉంటే,అది మా బాబాయ్ చూస్తే....ఊహే భయంకరం. కానీ అంత కంటే ఘోరమయిన అవమానం ఇంకో నాలుగు నెలల్లో జరగబోతోందని తెలీదు అప్పటికి నాకు.
మొత్తానికి మా ఆర్టీసీ యాత్రలు, హాస్టల్ కి ఫోన్లు,డీటీడీసీ కొరియర్లు, వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఏమీ ఎరగనట్లు పాత ఫ్రెండ్స్ లాగ మాట్లాడుకోవడం లాంటి వాటితో ఒక సంవత్సరం గడచిపోయింది.
ఒకసారి తను సినిమా కి వెళ్ళినప్పుడు మా పిన్ని,బాబాయి కూడా వచ్చారుట. మా బాబాయి మాటల్లో పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు అని అడిగేసరికి హీరో మొహం లో నెత్తురు చుక్క లేదు,ఓరి నాయనోయ్ ఈయనకి ఎలా తెలిసిందా అని.
కానీ మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ,ఏమిటి అన్నాడు మళ్ళీ. పెళ్ళెప్పుడు అని అడుగుతున్నా అని అడిగేసరికి, నేను రెడీ కానీ అమ్మాయి ఏది అని సమాధానం ఇచ్చేసరికి మా పిన్ని అందుకుని ఎవరో ఎందుకు, మా అమ్మాయే ఉంది గా అంది.మీ అమ్మాయిని నేను చేసుకోను బాబోయ్ అని కాస్త నటించగానే మా పిన్ని మా అమ్మాయికేమి తక్కువ, అప్పుడే సంబంధాలు కూడా వస్తున్నాయి అందిట. అంతే,ఆరోజే హీరో గారి ఫోను నా హాస్టల్ కి.
ఏమిటి సంబంధాలు వస్తున్నాయిట అంటూ. అవును వస్తున్నాయి కానీ నాన్నగారు నా చదువయ్యేవరకు చెయ్యరు, అంత సీరియస్ కాదు లే అని చెప్పాను. అలా అన్నానే కానీ నాకూ భయం గానే ఉంది మనసులో, అసలు నాన్నగారికి ఈ విషయం ఎలా చెప్పాలా అని.
ఎలాగూ నెక్స్ట్ కొన్ని టపాలలో ఆ సీరియస్ విషయాలు రాస్తా లెండి,ప్రస్తుతానికి హ్యాపీ పార్ట్ చెప్పుకుందాము.
ఒకసారి నేను మా నాగమణి కలిసి బామ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. పాపం నాగమణి రానంటున్నా కానీ బలవంతంగా లాక్కెళ్ళాను. నేను వస్తున్నా అని ముందే చెప్పడంతో ఏదో వంక పెట్టి హీరో స్టేషన్ కి వచ్చాడు.
అక్కడ ఏదో ఫార్మల్ గా పలకరించి బామ్మింటికి వెళ్ళానే కానీ మనసంతా ఒకటే ఆరాటం ఎప్పుడు అత్తా వాళ్ళింటికి వెళ్తానా అని. ఇంట్లో కాళ్ళూ చేతులూ కడుక్కుని బామ్మ నాకోసం చేసిన తొక్కుడు లడ్డు తిని అత్తా వాళ్ళింటికి బయలుదేరాను.
ఇప్పుడే కదే ఎండన పడి వచ్చావు కాస్త చల్లబడ్దాకా వెళ్ళరాదూ అని బామ్మ అంటున్నా వినిపించుకోకుండా గేటు మూసేసి పరుగు లాంటి నడకతో అత్త వాళ్ళింటికి వెళ్ళి ఎదురుచూపులు మొదలెట్టాను.
నేను వచ్చాను అని చెప్పడానికన్నట్లు ఒకటి రెండు సార్లు అలా దొడ్లో కి వెళ్ళి కాస్త గట్టిగా మాట్లాడి(ఒక వేళ ఇంటి వెనకాల ఉన్నాడేమో అని), ముందు వైపు వెళ్ళి వాళ్ళింటి వైపు చూస్తూ మాట్లాడినా హీరో జాడ తెలియదే. ఇంతలో వాళ్ళమ్మగారు బయటకి రాగానే ప్రాణం లేచి వచ్చింది. ఆంటీ ప్రదీప్ లేడా(యెస్,హీరో పేరు ప్రదీప్) అని అడుగుదామని నోటి దాకా వచ్చి, ఆంటీ బాగున్నారా అని అడిగాను ఓ వెర్రి నవ్వు నవ్వుతూ. బావున్నానమ్మా,మొన్నే కదా వెళ్ళావు నువ్వు కాలేజీ కి అప్పుడే శలవలా అని అడిగేసరికి ఏమి సమాధానం చెప్పాలో తోచలేదు. ఆ,అంటీ అని ఏదో చెప్పబోయేంతలో నాకు చిరపరిచితమయిన బజాజ్ చేతక్ హారన్ మోత వినపడింది. అంతే, అప్పుడు కానీ మా ప్రదీప్ వాళ్లమ్మగారు నన్ను చూసుంటే ఆవిడకి కధ ఎవరూ చెప్పక్కర్లేకుండానే అర్ధం అయ్యేది. ఏమిటే ఆ ఎక్సైట్మెంట్ అని మా నాగమణి నా చెవిలో చెప్పేంతవరకూ తెలీలేదు నాకు అసంకల్పితంగా నా ఫీలింగ్స్ ని బయట పెట్తేసా అని.
అమ్మా,నేను పని మీద బయటకి వెళ్తున్నా,ఏడున్నరకి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తా అనగానే అర్ధం అయిపోయింది నాకు ఏడున్నరకల్లా ఎక్కడకి వెళ్ళాలో. అంతే, ఇక ఆలస్యం చెయ్యకుండా బామ్మ ఇంటికి బయలుదేరా.
బామ్మ ఇంటికి వెళ్ళి కాసేపుండి గుడికి వెళ్తే అనుమానం రాదు కదా ఎవ్వరికీ.పిన్నీ గుడికి వెళ్తున్నా అనగానే మా పిన్ని షాక్. ఏమిటే ఎప్పుడూ పెద్దగా ఇంట్రస్ట్ చూపించవు,ఏమిటి సడెన్ గా అని.ఇంతలో మా పిన్ని కూడా తయారయ్యింది నేనూ వస్తా అని. తనని ఎలా ఆపడం?
పిన్నీ, నాకు నీ ముక్కల పులుసు, కంది పచ్చడి తినాలనుంది డిన్నర్ కి చెయ్యి ప్లీజ్ అని అడిగాను.
రెండ్రోజులు ఉంటావు కదా రేపు చేస్తా లే అంది. ప్లీజ్ ఇప్పుడే చెయ్యి,కావాలంటే నేను సాయం చేస్తా అనేసరికి మీరిద్దరూ వెళ్ళిరండి గుడికి నేను వంట చేస్తా లే అని నన్ను నాగమణి ని గుడికి పంపింది.
గుడికి వెళ్ళిన కాసేపటికి ప్రదీప్ వచ్చాడు. ఏదో ఓ పావుగంట మాట్లాడుకుని ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరాము.
మరునాడు మధ్యాహ్నం వాళ్ళింటికి వెళ్ళాము నేనూ నాగమణి కలిసి. మా కాబోయే అత్తగారు ముభావం గా మాట్లాడి లోపలకి వెళ్ళిపోయారు పని చేసుకోవడానికి. ఇక నాకు భయం మొదలు. ఇంటికి వెళ్ళిపోతా అని మొదలెట్టాను. ఏమీ కాదు కూర్చో అని ప్రదీప్ కళ్ళతోనే సైగలు.
కాసేపటికి రెండు కప్పుల్లో టీ తీసుకొచ్చి అక్కడ పెట్టి మరలాలోపలకి వెళ్ళిపోయారు వాళ్ళమ్మగారు. నేను టీ తాగను అని అందామని నోటి దాకా వచ్చి ఆగిపోయాను. మరి ఎదురుగా ఉన్నది అత్తగారు కదా.
ఆరోజు రాత్రి ఫోనులో చెప్పాను,ప్లీజ్ మీ ఇంటికి రమ్మని ఎప్పుడూ పిలవకు,చాలా భయమేసింది మీ అమ్మగారిని అలా చూడగానే అని.
ఏమీ కాదు,కొంచం నువ్వంటే మంచి అభిప్రాయం ఉన్నట్లు లేదు,మెల్లిగా మారుతుంది లే అన్నాడు.
సినిమాలలో అయితే ఎంచక్కా ఏవో రెండు మంచి పనులు చెయ్యగానే అత్తగారు కరిగిపోతారు కాబోయే కోడలికి. అయినా నా వంతు ప్రయత్నం గా ఆవిడ కనపడ్డప్పుడల్లా నవ్వుతొ పలకరించేదానిని.
కొన్నేళ్లకి నాకు తెలిసింది ఎందుకు ఆవిడ అప్పుడు నాతో అలా ఉందో. ఈరోజు ప్రదీప్ వచ్చి నన్ను కలిస్నట్లు ఆవిడకి తెలిసిపోయిందిట. మరి ఎవరికయినా కోపం రాదా చెప్పండి వెనక అంత కధ పెట్టుకుని ముందు ఏమీ తెలీనట్లు నటిస్తే.
ఇలా మొత్తానికి మేము మా ప్రపోజల్ మొదటి యానివర్సరీ ని జరుపుకున్నాము. ఆరోజు సర్ ప్రైజ్ గా ప్రదీప్ చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చి నా హాస్టల్ దగ్గర కలిసాడు.
ఇంతలో వాళ్ళ పైన కొత్తగా కడుతున్న ఇంటి శంఖుస్థాపన కార్యక్రమం వచ్చింది.అదే ముహుర్తానికి అత్తా వాళ్ళ పైనింటి శంఖుస్థాపన కూడా రావడంతో అమ్మ వాళ్ళు నన్ను పంపారు వెళ్ళి రా అని. ఆ కార్యక్రమంలో ప్రదీప్ కనపడలేదు,ఎంత కోపం వచ్చిందో తను రాలేదు అని.ఇప్పట్లా సెల్ ఫోనులు లేవు కదా నిమిషాలలో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి. నేనూ అనుకోకుండా వచ్చాను అసలు ఈ కార్యక్రమానికి. తనకి ఎగ్జాంస్ ఉండడంతో రాలేదు,శంఖుస్థాపనే కదా,గ్రుహప్రవేసానికి వద్దామని.
ఇంకో రెండు నెలల్లో పెద్ద పెద్ద బాంబులు పేలబోతున్నాయి అని నా మనసు కనీసం హెచ్చరించలేదు నన్ను. హెచ్చరించుంటే కాస్త జాగ్రత్త గా ఉండేదానిని.
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
ee madya baagaa late gaa rastunnaru eduru chudaleka potunnamu please kasta tondara gaa raayandi manasa...
అయ్యో అలా అనకండి మంజు గారూ. కావాలని లేటు గా రాయట్లేదండీ. ఇంట బయటా బిజీ.పైగా నేను ఈ కధ ని హాయిగా రిలాక్సింగా ఉన్నప్పుడు తప్ప రాయను. తీరికుంటే రాసే మూడ్ ఉండదు లేదా రివర్స్.ఇన్నిరోజులకి నాకు అన్నీ కుదిరాయి. నెక్స్ట్ పార్ట్ వెంటనే రాసెస్తా వారం లోపు.
మానస గారు, మరి ఇంత లేట్ అయితే ఎలా అండి. మీరు ప్రతి పార్ట్ చివర ఏదో ఒక ట్విస్ట్ పెడతారు డైలీ సీరియల్ లాగా కానీ మీ పోస్ట్ ఏమో మాసపత్రిక లా నెలకి ఒక్కసారి రాస్తారు. ఏమనాన్ బాగుందా చెప్పండి.
పేలబోతున్నా అ పెద్ద పెద్ద బాంబులు ఏంటో తొందరగా రాసేయండి లేక పొతే ఇక్కడ మేము పెలిపోతము ఏమి జరిగివుంటుంది అని ఆలోచిస్తూ. కానీ మీ ప్రేమకద అద్బుతం. నాకు ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు తెస్తుంది.
"అ రోజు" కి త్వరగా వచ్చేయండీ - టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను.
Waiting for the Bombs which are ready to be exploded... Make it fast manasa :-)
ఈ పోస్ట్ రాసి చాలా రోజులు అయింది. మరి ఆ బాంబుల సంగతి ఎప్పుడు రాస్తారని నేను ప్రశ్నిస్తున్నా అధ్యక్షా.
నేను చదవడమే ఆలస్యంగా చదివి మళ్ళీ ఈ దబాయింపు ఏంటని అనుకుంటున్నారు కదా. :)
ఏదో ఈ మధ్య ఇటు రావడం కుదరలేదు. కాస్త ఆ విషయమేదో రాసేద్దురూ... ఇక్కడ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను :)
మీ కథ చాలా బాగుంది మానస గారు.
అమ్మాయి కళలు ,జేబీ,కిషన్,సాయి ప్రవీణ్ గార్లకి,
దీని నెక్స్ట్ పోస్టు రాయడం బాగా లేటయ్యిందండీ వివిధ కారణాలతో. అసలు మలుపు అయిపోయింది,ఇక ఓ మూడేళ్ళలో ఎలాగూ పెళ్ళి చేసుకుంటాము కాబట్టి ఇక మీకు వెయిటింగ్ బాధ ఉండదు.మీ అభిమానానికి ధన్యవాదాలు.
ఏమిటి సంబంధాలు వస్తున్నాయిట అంటూ :-)
Post a Comment