Saturday, December 10, 2011

ఇదీ సంగతి మరి

మరునాడు నిద్ర లేచాకా ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం. అమ్మ లేచి కాం గా పని చేసుకుంటోంది. నాన్నగారు లేచి మామూలుగానే ఆఫీసుకి బయలుదేరారు. ఇద్దరి వైపు కన్నెత్తి చూడాలంటే గుండెలు అదిరిపోతున్నాయి నాకు. తప్పుచ్ హేసిన భావన వెంటాదుతోంది.

సాయంత్రం ప్రదీప్ నుండి ఫోను. నాన్నగారు రిసీవ్ చేసుకున్నారు. చిన్నప్పటినుండీ నాన్నగారిని పెద్ద మామయ్యా అని పిలవడం ప్రదీప్ కి అలవాటు. "పెద్ద మామయ్యా నేను ప్రదీప్ ని, ఫలానా ఊరి దగ్గర ఉన్నాను మీ ఊరికి వస్తున్నాను ప్లీజ్ కోప్పడకండి" అన్నాడు.

అంతే నాన్న కయ్యిన లేచారు తన మీద.ఆయన అప్పుడన్న మాటలు తలచుకుంటే నవ్వొస్తుంది ఇప్పుడు.నీకే తాడూ బొంగరం లేదు నీకు మానస కావాలా అన్నారు. లోపల నుండి వింటున్న నేను షాక్. మొట్టమొదటి సారి ఆలోచించాను ఇక మా కధ ఇంతేనా అని.

తుఫాను ఎన్ని రోజులుంటుంది.ఒక నాలుగైదు రోజులకి కాస్త తేరుకుని అమ్మ కి పని లో సాయం చెయ్యడం నాన్నగారికి అవీ ఇవీ అందివ్వడం చేస్తూ రొటీన్ లో పడ్డాను.ఎంత కాని పని చేసావే అంటూ అమ్మ మధ్య మధ్య లో అంటూనే ఉండేది. ఒకోసారి దుఖ్ఖం తట్టుకోలేక ఏడ్చేసేది.తను అలా బాధపడుతోంటే నాకు కోపం వచ్చేది కానీ ఇప్పుడు తెలుస్తోంది తల్లి హ్రుదయం అంటే ఏమిటో.

అప్పుడు ఇంటర్నెట్టూ అదీ ఇంత విరివి గా వాడకం లేదు. సో, నో కాంటాక్ట్ ప్రదీప్ తో.

ఒక పది రోజుల తరువాత అమ్మ అడిగింది నాన్నగారిని నన్ను కాలేజీ కి పంపి చదువు కంటిన్యూ చేయించమని. నాన్నగారికి అస్సలు ఇష్టం లేదు అని తెలుస్తూనే ఉంది. ఇంత జరిగాకా ఏ తండ్రి అయినా ఎలా ఒప్పుకుంటాడు? మొట్టమొదటిసారి అమ్మ నాన్నగారితో గట్టిగా మాట్లాడింది. చదువు మధ్యలో మానిపించి ఏమి చేస్తామూ అంటూ.

అసలు ఇంక ప్రదీప్ ని కలవను అని గట్టిగా చెప్పి హాస్టల్ కి వచ్చాను.రాగానే మా ఫ్రెండు నవీన్ తో ప్రదీప్ వాళ్ళింటికి ఫోను చేయించి నేను మాట్లాడాను. మరునాడే నన్ను చూడటానికి వస్తాను అని తను పట్టుపడితే , అస్సలు రావద్దు కనీసం నీతో మాట్లాడతాను అనుకోలేదు, ఇలా చాలు అని నేను సర్ది చెప్పాను.

మార్చి ఇరవై సంఘటన నాలో ఎంత భయాన్ని నింపింది అంటే అసలు తనని కలవాలి అంటేనే భయపడేంతగా.

ఒక వారానికి చెప్పాపెట్టకుండా వచ్చేసాడు.రావద్దు అని అంటూనే ఉన్నాను కానీ తనని చూడగానే గట్టిగా ఏడ్చేసి సహజ సిద్ధమైన ఆడపిల్ల ఉక్రోషంతో అడిగాను ఆరోజు అంత గొడవ జరుగుతోంటే ఎందుకు రాలేదు, ఎంత నరకం అనుభవించానో నీకేమి తెలుసు అంటూ.

ఒక 2-3 నెలలకి కాస్త కుదుటపడ్డాను.ఇంటికి మామూలుగా వెళ్ళివచ్చేదానిని శలవలకి. కానీ నాన్న కాస్త స్ట్రిక్ట్ అయ్యారు నా విషయం లో.అంతవరకూ ఎప్పుడూ నాకోసం ఎవ్వరు ఫోను చేసినా కానీ ఎందుకు ఫోను చేసావు అని అడగని నాన్న ఎవ్వరు ఫోను చేసినా తనే రిసీవ్ చేసుకునేవారు.వివరాలు అడిగి కానీ నాకు ఇచ్చేవారు కాదు. నా మీద నమ్మకం పోయింది అన్న ఊహ బాధించేది.కానీ ప్రదీప్ ని వదులుకోలేను నాన్న ని బాధపెట్టలేను.

ఒకసారి అలా శలవలలో ఇంటికి వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్ నవీన్ ఫోను చేసాడు.అప్పట్లో ఫోను చాలా ఖరీదైన వ్యవహారం.ఎస్టీడీ కాల్స్ అన్నీ 9 తరువాతే.

నాన్న ఫోనెత్తారు. నేను నవీన్ అండీ అన్నాడు పాపం."అయితే ఏంటి" అన్నారుట నాన్నగారు.(ఈ విషయం నేను కాలేజీ కి వెళ్ళాకా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు నవీన్. ఎవ్వరూ మానస ఇంటికి ఫోను చెయ్యకండీ అంటూ)

ముందు సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయండీ. తను కాలేజీ 3rd అని చెప్పాడు. అయినా నాన్న కి నమ్మకం కలుగలేదు.నాకివ్వకుండా తనే మార్కులు నోట్ చేసుకున్నారు.

నాకయితే పట్టరాని ఆనందమనిపించింది రిజల్ట్స్ చూడగానే.ఇంట్లో అంత పెద్ద గొడవ తరువాత జరిగిన పరీక్షలవి. ఎంత పట్టుదలగా చదివానో.చాలా నెలల తరువాత నాన్న మొహం లో చిన్న ఆనంద రేఖ చూసాను. కుక్క తోక సామెత లాగ ఇలాగే చదివేసి మార్కులు తెచ్చుకుని ఉద్యోగం సంపాదించేసి నాన్నని ఒప్పించెద్దాము అనిపించేది.

అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే పాఠాలెప్పుడు నేర్చుకుంటాము?ప్రదీప్ చదువు పూర్తి కాగానే ఉద్యోగం రాలేదు. నాకేమో అక్కడ నుండీ ఇక్కడనుండీ సంబంధాలు వస్తున్నాయి.

నా ఒత్తిడి తట్టుకోలేక తన ఫ్రెండు చేస్తున్న వ్యాపారం లో భాగస్వామి అయ్యాడు. అదీ అచ్చి రాలేదు మొదట్లో.

కొన్ని రోజులకి పుంజుకున్నాడు. నాకూ కాలేజీ లో ఉద్యోగం వచ్చింది.కానీ ఎక్కడా ఇంట్లో ఒప్పుకుంటారన్న ఆశ మాత్రం కనపడేది కాదు.

నా చదువు పూర్తయ్యెముందోసారి అయ్యాకా ఇంకోసారి నాన్న అనారోగ్యం పాలయ్యారు. సినిమాలలో చూపించినట్లే డాక్టరు గారేమో ఆయనని టెన్షన్ పెట్టకండి అని చెప్పారు.ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి చూసాకా నాన్నతో ఇలా చెప్పాలి అని అప్పుడప్పుడు మనసులో రిహార్సెల్స్ వేసుకున్న మాటలు కూడా పెగిలేవి కాదు.

ఏడాది గడిచింది.ఇద్దరి ఇంట్లో ఒప్పుకుంటారన్న ఆశ ఏ మాత్రం కనపడేది కాదు. ఇది జరిగే పని కాదు అనుకుని ఇక ప్రదీప్ కి చెప్పేసాను విడిపోదాము అని.అప్పట్లో Toefel,GRE ఓ పెద్ద సవాలు(ఇప్పటికీ ఇదే ట్రెండ్ ఉందేమో తెలీదు).నా మానాన్న నేను చదువుకుంటాను ఇక అని చెప్పాను.మొండి ఘటం ఒప్పుకుంటాడేమిటి ఒక్క పటాన.


నువ్వు ఇలా మాట్లాడితే నేనే వెళ్ళి పెద్ద మామయ్యతో మాట్లాడుతాను అన్నాడు.అంతే,భయమేసేది నాకు.మళ్ళీ ఆయన నారోగ్యం ఎక్కడ తిరగబెడుతుందో అని.అంతే మళ్ళీ కధ మొదటికే. విషయం అలా నానుతూ వచ్చింది.

ఇంతలో మా అక్క నాన్నగారిని ఒప్పించింది వెళ్ళి ప్రదీప్ వాళ్ళింట్లో మాట్లాడేటట్లు.

నాన్నగారు వాళ్ళు అక్కడకి వెళ్ళకముందే ప్రదీప్, నాన్నగారిని కలిసాడు. ఇంతకముందు కలవడం వేరు ఇప్పుడేమో కాబోయే అల్లుడి హోదా :).

నాన్న తనని అక్కా వాళ్ళింట్లో పరిచయం చేసారు.కట్న కానుకల ప్రసక్తే తేవద్దు ఆ మాటలు ఎక్కడికో దారి తీస్తాయి అని తను చెప్పగానే ఎంత సంతోషమేసిందో. నాన్న తనకి ఉన్నదంతా మా మీఅదే వెచ్చించారు. .

అమ్మ వాళ్ళు వెళ్ళారు. మొదట్లో కాస్త ఏవో కాస్త చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అందరూ కలిసి మార్చి 20 న ముహుర్తం నిర్ణయించారు.
మా పెళ్ళి కీ నిశ్చితార్ధానికీ మధ్యలో 15 రోజులు మాత్రమే వ్యవధి. అఫీషియల్ గా కన్ ఫర్మ్ అయ్యింది కదా అని నన్ను బయటకి తీసుకెళ్తానని ప్రదీప్ అంటే నాన్న ఒప్పుకునే వారు కాదు.

ఠాఠ్ ఈ పెళ్ళికి మేము రాము అని నాన్న తరపు వాళ్ళు భీష్మించుకు కూర్చున్నారు.అక్క బావగారే అన్నీ తామై పెళ్ళి జరిపించారు. అసలు పెళ్ళి ఎంత బాగా జరిగిందో.

అసలు కధ ఇప్పుడే మొదలయ్యినంది.ప్రదీప్ వ్యాపారం దెబ్బతింది. విపరీతమైన టెన్షన్.ఒక తొమ్మిది నెలలు నరకం అనుభవించాము.

దేవుడి దయ వలన ఒక ఆసరా దొరికింది. దానిని ఆలంబన గా చేసుకుని ప్రదీప్ అంచెలంచలుగా ఎదిగి ఒక మంచి స్థానం లో ఉన్నాడిప్పుడు.మళ్ళీ వ్యాపారం జోలికి పోలేదెప్పుడూ.

ఇరు కుటుంబాలవారూ ఇప్పుడూ హ్యాపీ. అసలు మాకే గుర్తు లేదు ఇంత కధ జరిగిందా అని.కుటుంబ బాధ్యతలతో బిజీ బిజీ.

మధ్య మధ్య లో అలకలు పోట్లాటలు మామూలే. ఇద్దరమూ సమ ఉజ్జీలము కాబట్టి పోట్లాటలు బాగానే జరిగేవి మొదట్లో.సమయం గడిచే కొద్దీ మెచ్యూరిటీ పెరిగింది ఇద్దరికీ.

ఎప్పుడైన మేము కలిసి తిరిగిన ప్రదేశాలు చూసినా వాటి గురించి విన్నా మనసు అలా అలా తేలి ఎక్కడికో వెళ్ళిపోతుంది.

ఇదండీ సంగతి.దాదాపు 2 దశాబ్దాలక్రితం మా అత్త కూతురి పెళ్ళి లో క్రికెట్ ఆడుతోంటే వన్ సైడెడ్ గా మొదలైన ప్రేమ కధా కమామీషూనూ.ఈ చివరి భాగం ఇంట్రస్టింగా రాయలేకపోయానేమో అనిపిస్తోంది,ఏమంటారు?

మర్చిపోయాను చెప్పడం,ఇద్దరి హాస్టల్ చదువులూ పూర్తయ్యాకా ఇద్దరి దగ్గరా ఉన్న ఉత్తరాలు ఎక్కడ పెట్టాలి అన్న సమస్య వచ్చింది. వాటిని ఒక సూట్ కేసు లో పెట్టి తాళం వేసి ప్రదీప్ తన ఫ్రెండు వాళ్ళింట్లో అటక మీద పడేసాడు.పెళ్ళయ్యాకా ఒక నిధి ని తెచ్చుకున్నట్లు దానిని తెచ్చుకున్నాము.

ఒక్కటి మాత్రం నిజం అప్పుడు రాసుకున్న ఉత్తరాలు ఇప్పుడు చూస్తే నవ్వొస్తుంది.

నా బ్లాగు చదువుతున్న అందరికీ ధన్యవాదాలు. May be this is the last post in this blog. ఎప్పుడైనా రాయాలనిపిస్తే మా ప్రేమ కధ లో,జీవితం లో జరిగిన చెమక్కులు రాస్తుంటాను.

Take care and Wishing you all a very happy new year.

Thursday, January 6, 2011

మార్చి 20--రెండు విధాలుగా గుర్తుండిపోయే రోజు



XXXX సంవత్సరం మార్చ్ 18. వాళ్ళ ఫ్రెండు పెళ్ళి ఉందని నేను చదువుకునే ఊరొచ్చాడు ప్రదీప్. నేనూ వెళ్ళా ఆ పెళ్ళికి. ఏమిటో గత రెండు రోజులనుండీ మనసులో ఏదో అలజడి గా ఉంటోంది. ఏమిటో తెలీదు.సరేలే,ఎలాగూ ప్రదీప్ కూడా ఊళ్ళోనే ఉంటాడు,బామ్మ ని కూడా చూసొద్దామని బామ్మ వాళ్ళ ఊరు బయలుదేరా.ఇంటికి వెళ్ళగానే ఎవ్వరూ సరిగా పలకరించలేదు. తేడా తెలుస్తోంది నాకు.ఏమిటో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడట్లేదు.

కొంప దీసి విషయం తెలిసి పోలేదు కదా అనిపించి,ఆ, అయినా ఎలా తెలుస్తుంది మా ఉత్తరాలన్నీ మా దగ్గరే భద్రం గా ఉంటే అనుకున్నా. కానీ సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనసు చెప్తూనే ఉంది.నాన్నగారు ఫోను చేసారు,కానీ ముభావం గానే మాట్లాడారు.నేను వస్తున్నాను అనేసరికి గుండెలు జారిపోయాయి.ఎందుకు ఇంత సడెన్ గా అని.

XXXX మార్చ్ 19:నేను బామ్మా వాళ్ళ ఊరొచ్చినప్పుడెప్పుడూ ఇలా లేదు,తనని కలవడమే అవ్వట్లేదు.సాయంత్రం ఆరు గంటలప్పుడు మాత్రం వెంకటేస్వర స్వామి గుడికి వచ్చాడు ఒక్క 10 నిమిషాలు మాట్లాడటానికి. మన విషయం తెలిసిపోయినట్లనిపిస్తోంది,భయమేస్తోంది అన్నాను.ఏమీ కాదు,నేనున్నాను కదా,ధైర్యం గా ఉండు అయినా ఉత్తరాలన్నీ నీ దగ్గర నా దగ్గర క్షేమం గానే ఉన్నాయి కదా అన్నాడు. అవును కదా ఎందుకు అనవసర భయం అనిపించింది. అంతే కానీ 15 రోజుల క్రితం సర్ప్రైజ్ చేద్దామని పంపిన కార్డు,తనకి రాసిన ఉత్తరం వాళ్ళ అక్క చేతిలో పడి ఉంటుందని అప్పుడు ఊహించలేక పోయాను.

ఇంటికి వచ్చానే కానీ మనసంతా ఏదో లా ఉంది.ఆరోజు ని తలచుకుంటే ఇప్పటికీ వణుకే నాకు. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడలేదు ఇంట్లో. మధ్య రాత్రి ఎప్పుడో నాన్న వచ్చారు పాపం అంత దూరం ఉండి ఓ నాలుగైదు బస్సులు మారి.ఎందుకు ఇప్పుడు వచ్చారు అంటే బాబాయి అర్జెంటు గా రమ్మన్నాడు అని చెప్పారు. ఇక కన్ఫర్మ్ అయిపోయింది నాకు మేటర్ లీక్ అని. తెల్లవారు ఝాము దాదాపు నాలుగింటి వరకు నాన్న అడుగుతూనే ఉన్నారు వెనక తులసి కోట దగ్గర మంచం మీద పడుకుని,చిన్నీ నిజం చెప్పు నీకూ ప్రదీప్ కీ మధ్య ఏమీ లేదు కదా అని. లేదు నాన్నగారూ,మంచి ఫ్రెండ్ అంతే అని బుకాయించాను ఎన్ని సార్లడిగినా కానీ. చివరికి ఆయన ఒక్క మాటన్నారు,నాకు తెలుసు నాన్న,నువ్వు అలాంటి పనులు చెయ్యవని, అమ్మ అంటూనే ఉంది,ఎవరితోనో మాట్లాడుతుంటే బాబాయి చూసి రాద్ధాంతం
చేస్తున్నాడేమో అనేసరికి ఏడుపు ఆగలేదు నాకు. కానీ ఆపుకోవడానికి బాత్రూం లో కి వెళ్ళిపోయాను. ఆ నిమిషం లో బయట పడిపోయి ఉన్నా బాగుండేదేమో,మరునాడు ఆయనకి తలవంపులు తప్పించే దానిని. అసలు నేను ఆరోజు పోస్టు చేసిన ఉత్తరం సంగతే మర్చిపోయి,అన్నీ నా దగ్గర భద్రం గా హాస్టల్ గదిలో ఉన్నాయి లే అన్న ధీమాతో నాన్నగారికి చెప్పలేదు. పైగా అప్పటికీ ఇంకా ప్రదీప్ సెటిల్ అవ్వలేదు. నో అంటారేమో అని భయం కూడా నా నోరు పెగలనివ్వలేదు.

తెల్లవారింది. కాఫీలు అవీ తాగాకా ఉదయం ఏడున్నరకి బాబాయి చెప్పాడు,అన్నయ్య పెద్ద బావగారు(మా అత్త వాళ్ళాయన) నీతో ఏదో మాట్లాడాలిట,వాళ్ళింటికి రమ్మన్నారు అని. నా గుండెలో వెయ్యి బాంబులు పేలిన భయం వేసింది నాకు. అత్త వాళ్ళ ఇల్లు మరి ప్రదీప్ వాళ్ళ ఇంటి పక్కనే కదా.

బిక్కు బిక్కు మంటూ నాన్నగారివెనకాలే నేనూ వెళ్ళాను. వెళ్లగానే మమ్మల్ని కూర్చోమని చెప్పి వెళ్ళి మామయ్య ప్రదీప్ వాళ్ళింటికి వెళ్ళారు. నేను అత్త వాళ్ళ గుమ్మం లో నిలబడి అన్నీ చూస్తున్నాను. ప్రదీప్ వాళ్ళ నాన్నగారు ఒక ఉత్తరము,గ్రీటింగు కార్డు ని దాదాపు మామయ్య ముఖం మీదికి విసిరినంత పని చేసారు.అంతే...మామయ్య అదే వేగం తో ఇంటికి వచ్చి ఏమితే ఇది అని నా మీద చెయ్యి చేసుకున్నారు.అంతే,నా దిమ్మ తిరిగిపోయింది. అసలు ఇలా ఎలా జరిగిందో అర్ధంకాలేదు నాకు.ఈ ఉత్తరం వీళ్ళ చేతుల్లో ఎలా అని ఆలోచిస్తున్నంత లోనే నా మీద నాలుగు దెబ్బలు వేసారు. నాన్న ఓ పక్కన అలా షాక్ తిని చూస్తూ ఉండిపోయారు. ఓ పావుగంట పాటు అంతా గందరగోళం.ఏమిటే నువ్వు చేసిన పని అని అత్తయ్యలు,మామయ్యలు అడగడం,అవును నేను ప్రదీప్ ని పెళ్ళి చేసుకుంటాను అని నేను అంతే గట్టిగా చెప్పడం జరిగిన తరువాత అప్పటి వరకు కాం గా ఉన్న నాన్న ఇక నేను బతికి అనవసరం అంటూ,రైలు పట్టాల వైపు బయలుదేరారు. కనీసం ఒక్కరంటే ఒక్కరూ ఆపలేదు బయటకొచ్చి ఆయనని.


నేనే వెనకాల వెళ్ళి ఏడుస్తూ బతిమాలి బామ్మ వాళ్ళింటికి తీసుకురాగానే మరల అక్కడ నా మీద మాటల దాడి మొదలు.
నేను ఇంతలో ప్రదీప్ కి ఫోను చేసానువాళ్ళ అమ్మ తీసి తనకి ఇచ్చారు.ఇక్కడ ఇంత గొడవ జరుగుతోంతే,సార్ ఏమో అప్పుడే అక్కడ నిద్ర లేచారుట."ఆ తెలిసింది" అని మాత్రం అన్నాడు. ఒళ్ళు మండిపోయింది నాకు,అదే సమయం లో చాలా మంది ఆడపిల్లల లాగే నేనూ మోసపోయానా అన్న ఊహే భయంకరం అనిపించింది. అక్కడ మామయ్య కొట్టినా ఇంత బాధ అనిపించ లేదు,బాబాయి,అత్తలు ఎన్ని మాటలన్నా భరించాను కానీ తను ఈ టైం లో వచ్చి అవును ఇద్దరమూ పెళ్ళి చేసుకుందాము అనుకుంటున్నాము అంటాడనుకున్నాను మా ఇంటికి వచ్చి. ఒక్కసారిగా ఫోను పెట్టేసి ఏడవడం మొదలెట్టాను.నా మీద మాటల దాడి ఏ మాత్రం ఆగలేదు.
ఎవ్వరేమి అంటున్నా,అవును నేను ఇప్పటికీ అదే మాట చెప్తాను ప్రదీప్ ని పెళ్ళిచేసుకుంటాను అని చెప్పడం విన్న బాబాయి కోపం గా నా మీదకి చెయ్యి లేపేసరికి నాన్న గట్టిగా అరచి ఒక్క మాట చెప్పారందరికీ. దాని మీద ఎవ్వరి చెయ్యీ పడటానికి వీల్లేదు. అది నా కూతురు,
నడమ్మా!! బయలుదేరి మన ఇంటికి వెళ్దాము అని చెప్పి 10 నిమిషాలలో నన్ను బస్టాండు కి తీసుకెళ్ళారు.అంతమంది ముందు అంత అవమానం జరిగి కూదా నాన్నగారు ఏమీ జరగనట్లే ఉండి నేను ఎక్కడ సొమ్మసిల్లి పడిపోతానో ఏడ్చి,ఏమీ తినక అని దగ్గరుండి మరీ టిఫిన్ అదీ పెట్టించారు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరాము.

అప్పటికే అమ్మకి విషయం చేరినట్లుంది ఫోను ద్వారా.గుమ్మం లోకి అడుగు పెట్టగానే కయ్యిమంది నా మీద."ఇంత వెధవ పని చేస్తావనుకోలేదు" అని. నాన్నగారు వెంటనే నన్ను లోపలకి తీసుకెళ్ళిపోయి మంచం చూపించి పడుకో అన్నారు.

బట్టలు మార్చుకుంటా అని చెప్పి తలుపు వేసి ప్రదీప్ కి ఫోను చేసాను.వాళ్ల అమ్మ ఎత్తారు."ప్రదీప్! ఆ అమ్మాయి ఫోను అని చెప్పిఇచ్చారు
,నా పేరు కూడా పలకడం కూడా ఇష్టంలేనట్లు.

నేను ఇంటికి వచ్చాను అని మాత్రం చెప్పి ఫోను పెట్టేసా.

తరువాత నాన్న లోపలకి జ్యూసు తాగమ్మా అంటూ వచ్చారు. నాకు ప్రదీప్ కావాలి అంటూ ఏడుస్తూ గ్లాసు ని తోసేసినా కానీ ఏమీ అనలేదాయన.ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే,నాకెప్పుడూ నాన్న అంటే చాలా భయం కోప్పడతారని. కానీ ప్రదీప్ విషయం లో నన్ను ఒక్క మాట కూడా అనని మనిషి మాత్రం నాన్నగారే.

మరునాడు అక్క బావా వచ్చారు పరిగెత్తుకుంటూ. బావగారు, దగ్గర కూర్చోబెట్టుకుని అడిగారు విషయం ఏమిటమ్మా అని. అంతా చెప్పి ఏడ్చేసాను నాకు ఆ అబ్బాయి కావాలి అని.సరే ముందు నువ్వు చదువుకో,ఆ అబ్బాయి కి ఉద్యోగం అదీ రానీ,పైగా వాళ్ళు మన వాళ్ళు కాదంటున్నావు కదా,అన్నీ ఆలోచిద్దాము.నేనున్నాను నీకు అన్న భరోసా ఇచ్చి నేను ఎలాంటి అఘాయిత్యాలూ చెయ్యనని మాట తీసుకుని బయలుదేరారు.


కొసమెరుపేమిటంటే,ఈ సంఘటన జరిగిన మూడేళ్ళకి అంటే XXXXమార్చి 20 న నేను ప్రదీప్ వేద మంత్రాల సాక్షి గా పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటయ్యాము :)

Wednesday, November 10, 2010

"ఆ రోజు" కి రెండు నెలల ముందు వరకు

అలా అలా మా ఆర్టీసీ యాత్రలు సాగిపోతుండేవి. ఇంతలో హీరో పుట్టినరోజు వచ్చింది. తన పుట్టినరోజు కి బామ్మ వాళ్ళూరు వెళ్ళాను. ఇక రేపు పుట్టినరోజనగా హీరో గారి సణుగుడు మొదలు.అర్ధరాత్రి 12 గంటలకి మీ బామ్మ వాళ్ళింటి పైకి రా,నేను కేక్ తీసుకొస్తాను. కట్ చేస్తా నీతో కలిసి అని. ఇది అయ్యే పనేనా చెప్పండి ఒక అమ్మాయికి,ఇంట్లో వాళ్ళకి తెలీకుండా అర్ధరాత్రి తలుపు తీసుకుని మేడ పైకి వెళ్ళడం.


వద్దు అన్నాను అని అలిగాడు నా మీద. అయినా పట్టించుకోలేదు, రానంటే రాను అని ఖచ్చితం గా చెప్పాను. మొత్తానికి అలక మొహం తోనే పొద్దున్నే మా ఇంటికి వచ్చాడు. మొహం చూస్తే జాలేసింది కానీ. హమ్మో, ఆ విషయం తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది,ఒకవేళ నేను మేడ మీదకి వెళ్ళి ఉంటే,అది మా బాబాయ్ చూస్తే....ఊహే భయంకరం. కానీ అంత కంటే ఘోరమయిన అవమానం ఇంకో నాలుగు నెలల్లో జరగబోతోందని తెలీదు అప్పటికి నాకు.

మొత్తానికి మా ఆర్టీసీ యాత్రలు, హాస్టల్ కి ఫోన్లు,డీటీడీసీ కొరియర్లు, వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఏమీ ఎరగనట్లు పాత ఫ్రెండ్స్ లాగ మాట్లాడుకోవడం లాంటి వాటితో ఒక సంవత్సరం గడచిపోయింది.

ఒకసారి తను సినిమా కి వెళ్ళినప్పుడు మా పిన్ని,బాబాయి కూడా వచ్చారుట. మా బాబాయి మాటల్లో పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు అని అడిగేసరికి హీరో మొహం లో నెత్తురు చుక్క లేదు,ఓరి నాయనోయ్ ఈయనకి ఎలా తెలిసిందా అని.


కానీ మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ,ఏమిటి అన్నాడు మళ్ళీ. పెళ్ళెప్పుడు అని అడుగుతున్నా అని అడిగేసరికి, నేను రెడీ కానీ అమ్మాయి ఏది అని సమాధానం ఇచ్చేసరికి మా పిన్ని అందుకుని ఎవరో ఎందుకు, మా అమ్మాయే ఉంది గా అంది.మీ అమ్మాయిని నేను చేసుకోను బాబోయ్ అని కాస్త నటించగానే మా పిన్ని మా అమ్మాయికేమి తక్కువ, అప్పుడే సంబంధాలు కూడా వస్తున్నాయి అందిట. అంతే,ఆరోజే హీరో గారి ఫోను నా హాస్టల్ కి.


ఏమిటి సంబంధాలు వస్తున్నాయిట అంటూ. అవును వస్తున్నాయి కానీ నాన్నగారు నా చదువయ్యేవరకు చెయ్యరు, అంత సీరియస్ కాదు లే అని చెప్పాను. అలా అన్నానే కానీ నాకూ భయం గానే ఉంది మనసులో, అసలు నాన్నగారికి ఈ విషయం ఎలా చెప్పాలా అని.


ఎలాగూ నెక్స్ట్ కొన్ని టపాలలో ఆ సీరియస్ విషయాలు రాస్తా లెండి,ప్రస్తుతానికి హ్యాపీ పార్ట్ చెప్పుకుందాము.



ఒకసారి నేను మా నాగమణి కలిసి బామ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. పాపం నాగమణి రానంటున్నా కానీ బలవంతంగా లాక్కెళ్ళాను. నేను వస్తున్నా అని ముందే చెప్పడంతో ఏదో వంక పెట్టి హీరో స్టేషన్ కి వచ్చాడు.

అక్కడ ఏదో ఫార్మల్ గా పలకరించి బామ్మింటికి వెళ్ళానే కానీ మనసంతా ఒకటే ఆరాటం ఎప్పుడు అత్తా వాళ్ళింటికి వెళ్తానా అని. ఇంట్లో కాళ్ళూ చేతులూ కడుక్కుని బామ్మ నాకోసం చేసిన తొక్కుడు లడ్డు తిని అత్తా వాళ్ళింటికి బయలుదేరాను.


ఇప్పుడే కదే ఎండన పడి వచ్చావు కాస్త చల్లబడ్దాకా వెళ్ళరాదూ అని బామ్మ అంటున్నా వినిపించుకోకుండా గేటు మూసేసి పరుగు లాంటి నడకతో అత్త వాళ్ళింటికి వెళ్ళి ఎదురుచూపులు మొదలెట్టాను.

నేను వచ్చాను అని చెప్పడానికన్నట్లు ఒకటి రెండు సార్లు అలా దొడ్లో కి వెళ్ళి కాస్త గట్టిగా మాట్లాడి(ఒక వేళ ఇంటి వెనకాల ఉన్నాడేమో అని), ముందు వైపు వెళ్ళి వాళ్ళింటి వైపు చూస్తూ మాట్లాడినా హీరో జాడ తెలియదే. ఇంతలో వాళ్ళమ్మగారు బయటకి రాగానే ప్రాణం లేచి వచ్చింది. ఆంటీ ప్రదీప్ లేడా(యెస్,హీరో పేరు ప్రదీప్) అని అడుగుదామని నోటి దాకా వచ్చి, ఆంటీ బాగున్నారా అని అడిగాను ఓ వెర్రి నవ్వు నవ్వుతూ. బావున్నానమ్మా,మొన్నే కదా వెళ్ళావు నువ్వు కాలేజీ కి అప్పుడే శలవలా అని అడిగేసరికి ఏమి సమాధానం చెప్పాలో తోచలేదు. ఆ,అంటీ అని ఏదో చెప్పబోయేంతలో నాకు చిరపరిచితమయిన బజాజ్ చేతక్ హారన్ మోత వినపడింది. అంతే, అప్పుడు కానీ మా ప్రదీప్ వాళ్లమ్మగారు నన్ను చూసుంటే ఆవిడకి కధ ఎవరూ చెప్పక్కర్లేకుండానే అర్ధం అయ్యేది. ఏమిటే ఆ ఎక్సైట్మెంట్ అని మా నాగమణి నా చెవిలో చెప్పేంతవరకూ తెలీలేదు నాకు అసంకల్పితంగా నా ఫీలింగ్స్ ని బయట పెట్తేసా అని.


అమ్మా,నేను పని మీద బయటకి వెళ్తున్నా,ఏడున్నరకి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తా అనగానే అర్ధం అయిపోయింది నాకు ఏడున్నరకల్లా ఎక్కడకి వెళ్ళాలో. అంతే, ఇక ఆలస్యం చెయ్యకుండా బామ్మ ఇంటికి బయలుదేరా.


బామ్మ ఇంటికి వెళ్ళి కాసేపుండి గుడికి వెళ్తే అనుమానం రాదు కదా ఎవ్వరికీ.పిన్నీ గుడికి వెళ్తున్నా అనగానే మా పిన్ని షాక్. ఏమిటే ఎప్పుడూ పెద్దగా ఇంట్రస్ట్ చూపించవు,ఏమిటి సడెన్ గా అని.ఇంతలో మా పిన్ని కూడా తయారయ్యింది నేనూ వస్తా అని. తనని ఎలా ఆపడం?
పిన్నీ, నాకు నీ ముక్కల పులుసు, కంది పచ్చడి తినాలనుంది డిన్నర్ కి చెయ్యి ప్లీజ్ అని అడిగాను.



రెండ్రోజులు ఉంటావు కదా రేపు చేస్తా లే అంది. ప్లీజ్ ఇప్పుడే చెయ్యి,కావాలంటే నేను సాయం చేస్తా అనేసరికి మీరిద్దరూ వెళ్ళిరండి గుడికి నేను వంట చేస్తా లే అని నన్ను నాగమణి ని గుడికి పంపింది.

గుడికి వెళ్ళిన కాసేపటికి ప్రదీప్ వచ్చాడు. ఏదో ఓ పావుగంట మాట్లాడుకుని ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరాము.

మరునాడు మధ్యాహ్నం వాళ్ళింటికి వెళ్ళాము నేనూ నాగమణి కలిసి. మా కాబోయే అత్తగారు ముభావం గా మాట్లాడి లోపలకి వెళ్ళిపోయారు పని చేసుకోవడానికి. ఇక నాకు భయం మొదలు. ఇంటికి వెళ్ళిపోతా అని మొదలెట్టాను. ఏమీ కాదు కూర్చో అని ప్రదీప్ కళ్ళతోనే సైగలు.

కాసేపటికి రెండు కప్పుల్లో టీ తీసుకొచ్చి అక్కడ పెట్టి మరలాలోపలకి వెళ్ళిపోయారు వాళ్ళమ్మగారు. నేను టీ తాగను అని అందామని నోటి దాకా వచ్చి ఆగిపోయాను. మరి ఎదురుగా ఉన్నది అత్తగారు కదా.

ఆరోజు రాత్రి ఫోనులో చెప్పాను,ప్లీజ్ మీ ఇంటికి రమ్మని ఎప్పుడూ పిలవకు,చాలా భయమేసింది మీ అమ్మగారిని అలా చూడగానే అని.

ఏమీ కాదు,కొంచం నువ్వంటే మంచి అభిప్రాయం ఉన్నట్లు లేదు,మెల్లిగా మారుతుంది లే అన్నాడు.
సినిమాలలో అయితే ఎంచక్కా ఏవో రెండు మంచి పనులు చెయ్యగానే అత్తగారు కరిగిపోతారు కాబోయే కోడలికి. అయినా నా వంతు ప్రయత్నం గా ఆవిడ కనపడ్డప్పుడల్లా నవ్వుతొ పలకరించేదానిని.

కొన్నేళ్లకి నాకు తెలిసింది ఎందుకు ఆవిడ అప్పుడు నాతో అలా ఉందో. ఈరోజు ప్రదీప్ వచ్చి నన్ను కలిస్నట్లు ఆవిడకి తెలిసిపోయిందిట. మరి ఎవరికయినా కోపం రాదా చెప్పండి వెనక అంత కధ పెట్టుకుని ముందు ఏమీ తెలీనట్లు నటిస్తే.


ఇలా మొత్తానికి మేము మా ప్రపోజల్ మొదటి యానివర్సరీ ని జరుపుకున్నాము. ఆరోజు సర్ ప్రైజ్ గా ప్రదీప్ చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చి నా హాస్టల్ దగ్గర కలిసాడు.

ఇంతలో వాళ్ళ పైన కొత్తగా కడుతున్న ఇంటి శంఖుస్థాపన కార్యక్రమం వచ్చింది.అదే ముహుర్తానికి అత్తా వాళ్ళ పైనింటి శంఖుస్థాపన కూడా రావడంతో అమ్మ వాళ్ళు నన్ను పంపారు వెళ్ళి రా అని. ఆ కార్యక్రమంలో ప్రదీప్ కనపడలేదు,ఎంత కోపం వచ్చిందో తను రాలేదు అని.ఇప్పట్లా సెల్ ఫోనులు లేవు కదా నిమిషాలలో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి. నేనూ అనుకోకుండా వచ్చాను అసలు ఈ కార్యక్రమానికి. తనకి ఎగ్జాంస్ ఉండడంతో రాలేదు,శంఖుస్థాపనే కదా,గ్రుహప్రవేసానికి వద్దామని.

ఇంకో రెండు నెలల్లో పెద్ద పెద్ద బాంబులు పేలబోతున్నాయి అని నా మనసు కనీసం హెచ్చరించలేదు నన్ను. హెచ్చరించుంటే కాస్త జాగ్రత్త గా ఉండేదానిని.

Friday, September 24, 2010

మా ఆర్టీసీ యాత్రలు



ఆశ్చర్యమేస్తుంది అప్పుడు రాసుకున్న ఉత్తరాలు చూసుకుంటే :). పేజీలు పేజీలు నిండి పోయేవి ఈజీగా. అదే ఇప్పుడు రాయమంటే ఒక్క పేజీ మించి రాయలేనేమో. అయినా అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటాము. ఉత్తరాలలోని మధురానుభూతే వేరు కదా.

కానీ ఈ ఉత్తరమే నా జీవితాన్ని ఒక్క కుదుపు కి గురిచేస్తుంది అని మాత్రం ఊహించలేకపోయాను. ఎంత పెద్ద దొంగయినా చిన్న తప్పు చేస్తాడన్నట్లు మేము మా ఉత్తరాలు,గ్రీటింగు కార్డులని ఎవరి కంటా పడకుండా చాలా కష్ట పడి దాచాము. ఇద్దరమూ హాస్టలే కాబట్టి పెద్ద ఇబ్బంది వచ్చేది కాదు. కానీ ఒక సంవత్సరం తరువాత అజాగ్రత్తో,నిర్లక్ష్యమో మరోటో కానీ మాకు గాట్ఠి ఎదురు దెబ్బ తగిలింది. ఆ వివరాలు మరలా ఇస్తాను.

ఇలా ఒక సంవత్సరం గడిచింది. ఉత్తరాలు, మధ్య మధ్యలో నేను వాళ్ళ ఊరు వెళ్ళడం(బామ్మని చూసే వంకతో),లేదా శెలవలకి వచ్చినప్పుడు తనే నేను చదువుకుంటున్న ఊరు రావడం జరిగేది.


నేను చదువుకునే ఊరిలో ఇద్దరము కూర్చుని మాట్లాడుకునే స్థలాలు ఏమీ ఉండేవి కాదు. మన ఊర్లలో పార్కుల సంగతి తెలుసు కదా ఎలా ఉంటాయో. మేము ఎప్పుడూ కూర్చునే గుడి లో రినోవేషన్ జరుగుతుండటంతో మా అడ్డా మార్చాల్సి వచ్చింది.ఎక్కడ కూర్చోవాలో పాలుపోయేది కాదు. ఇలా మీమాంసలోనే ఒకరోజు ఆటో లో బస్టాండు వైపు నుండీ వెళ్తొంటే ఒక అవిడియా వచ్చింది. బస్సెక్కి కూర్చుంటే అని.


వచ్చిందే తడవుగా సెమీ లగ్జరీ టైపు లో కనపడిన బస్సు ఎక్కాము. మహా అయితే ఒక 2 గంటలు ప్రయాణం ఉంటుందిలే అనుకున్నా.నేనూ ఆ ఊరికి కొత్తే.చుట్టు పక్కల ఏవో 3-4 ఊర్ల పేర్లు తప్ప మిగతావి తెలీదు. బస్సు కదిలాకా రెండు గంటలు 3 గంటలు అవుతుందే కానీ గమ్యం రాదే. నాకు టెన్షన్ మొదలయ్యింది.

ఒక 4 గంటలకి అడవులలో ఉన్న ఒక ఊరిలో ఆగింది బస్సు. అదే ఊరుట. బస్సులో అందరూ దిగిపోయారు. ఇదే చివరి స్టాపు సార్,దిగరా అని డ్రైవర్ అరిచేసరికి నా పై ప్రాణం పైనే పోయింది. గట్టిగా ఒక 100 ఇళ్ళు లేవు ఊరిలో. అసలు బస్టాండే లేదు. ఒక చెట్టు కింద బస్సాపేసరికి ఇక నా టెన్షన్ చూడాలి,ఇప్పుడు వెనక్కెళ్ళడం ఎలా అని. ఏడుపొచ్చేసింది. పాపం హీరో పరిస్థితి చూడాలి,ఏదో తెలీని ఊరు,పక్కన ఏడుపు మొహంతో అమ్మాయి :)

డ్రైవర్ కి తెలిసినట్లుంది మేము ఇక్కడ కాదు దిగాల్సిందని. మళ్ళీ ఒక అరగంటలో వెనక్కి బయలుదేరుతుంది అనేసరికి కాస్త రిలీఫ్ నాకు. సరే,అని అలా బస్సు దిగి కిందకెళ్ళి ఏవో నాలుగు బిస్కట్లు కొనుక్కుని మళ్ళీ ఎక్కి కూర్చున్నాము. ఊరిలో అందరూ మమ్మల్ని చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేను నేను.

అలా మరలా ఒక నాలుగ్గంటలు వెనక్కి ప్రయాణం చేసి మా ఊరొచ్చాము. సాయంత్రం ట్రైన్ కి హీరో వెళ్ళిపోతొంటే సేం ఫీలింగ్,అప్పుడే రోజయిపోయిందా అని.

రూం లో పాపం మా రూమ్మేటు టెన్షన్,బయటకి వెళ్టే కనీసం ఒక్కసారయినా హాస్టల్ కి ఫోను చేసే దానిని,అలాంటిది ఐపు లేకపోయేసరికి ఆరోజు. అప్పుడూ సెల్ఫోనులు లేవింకా మరి. పబ్లిక్ బూత్ నుండి చెయ్యడమే. బస్సెక్కి నాలుగ్గంటలు కూర్చుంటే ఫోను ఎలా మరి? అదే విషయం చెప్పాను. జాగ్రత్త మానసా అని మాత్రం అంది. సెల్ఫోనులు,ఈ మెయిల్సు ప్రాచుర్యం పొందని కాలంలో ఈ కధ నడచినా కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తే అప్పుడే బాగుందనిపిస్తుంది.

మా క్లాస్మేట్స్, కాలెజ్ మేట్స్ కంటా పడకుండా ఈ బస్సు జర్నీ ఐడియా బాగుందనిపించింది. అందుకని నా చదువయ్యేంతవరకూ మా అడ్దా ఆర్టీసీ బస్సులే. హీరో వచ్చిన రోజు, పొద్దూన్నే ఏదో ఒక బస్సెక్కడం,మరలా అదే బస్సులోనో నెక్స్ట్ బస్సులోనో వెనక్కి రావడం అన్నమాట.


ఒకరోజు ఒక ఊరిలో అనుకోని బందు వల్ల కంటిన్యూస్ గా 19 గంటలు ప్రయాణం చేసామనుకొండి,అది వేరే సంగతి. ఆ ప్రయాణం తలచుకుంటే నవ్వొస్తుంది ఇప్పటికీ.ఒక 1-2 వేల వేల కిలోమీటర్లు ఈజీ గా RTC బస్సుల్లో తిరిగుంటాము మా పెళ్ళయ్యేంతవరకు.


మెల్లిగా నా ప్రేమ కధ విషయం మా క్లాసులో కూడా తెలిసిపోయింది.

మా ఫ్రెండు ఒకసారి మా జిల్లా మ్యాప్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఇదెందుకు అన్నాను. నీకు రూట్ మ్యాప్ ఇది,యే ఊరు ఎక్కడుందో తెలీడానికి అనేసరికి నవ్వాగలేదు నాకు. హీరోని కలిసిన మరునాడు కాలేజీ కి వెళ్తే మా ఫ్రెండ్స్ బ్యాచ్ జంధ్యాల సినిమాలో సుత్తి వీర భద్ర రావు లాగ ఊర్ల పేర్లు వరస బెట్టి చెప్పేవారు. యే యే పొర్లు వెళ్ళవో నిన్న ,చెప్పు మరీ అనేవారు. నిజం చెప్పొద్దూ ఒకోసారి హీరోకీ అమ్మ నాన్నలకి మధ్య నలిగిపోయేదానిని.


నాసంగతి మా కాలేజీ లో కూడా తెలిసింది. నలుగురి నోటిలో నానకుండా ఉండటానికి గోప్యం గా ఉంచాలని ప్రయత్నించా కొన్నాళ్ళు,కానీ ఎన్నాళ్ళు దాచగలము నిజాన్ని?. అఫ్ కోర్స్,ఇదే నన్ను మా సీనియర్ల ర్యాగింగు నుండీ తప్పించిదనుకోండి.


నేను ఆల్రెడీ ఎంగేజ్డ్ అని తెలిసి మిగతా అమ్మాయిలంత నన్ను పెద్దగా పట్టించుకోలేదు మా కాలేజీలో. మా ఫ్రెండ్స్ వెనకాల పడ్డట్లు నా వెనక ఎవరూ పడలేదు.ఇదో ప్రివిలేజ్ అన్నమాట. ప్రివిలేజ్ అని సరదాగా ఇప్పుడంటున్నా కానీ నాకు తెలుసు మా రెండూ కుటుంబాలు ఎంత క్షోభ అనుభవించాకా ఇప్పుడు హ్యాపీ గా ఉన్నాయో.


ఒక్కటి మాత్రం చెప్పగలను,నేను ఇష్టపడ్డ వ్యక్తి నన్ను సొంతం చేసుకునేందుకు నా కంటే ఎక్కువ కష్టపడ్డాడు.

అలా అని మేమేదో ఇప్పుడు ఐడియల్ కపుల్ అనుకోకండి. మా కీచులాటలు,అలకలు మామూలే. అసలు ఇప్పుడు ఇవన్నీ తలచుకుంటే నవ్వొస్తుంది. అప్పట్లో ఉద్యోగం తెచ్చుకుని పెళ్ళి చేసుకోవడమే పెద్ద చాలెంజ్ అన్నట్లుండేది. అసలు ఛాలెంజిలు అన్నీ ఆ తరువాతే అని ఇప్పుడు తీరికగా తెలిసింది.

మా ఇద్దరి తల్లి తండ్రుల ఆశీర్వాదం,అండ దండలతో ఇనీషియల్ హిక్కప్స్ అన్నీ అధికమించగలిగలిగి ఇప్పుడు ఒక గౌరవనీయమయిన జీవితం గడుపుతున్నాము.

Thursday, July 29, 2010

ఛిట్టీ ఆయీ హై




హాస్టల్ కి వచ్చానే కానీ మనసంతా ఏదో దిగులు.మరునాడు నా పుట్టినరోజు.రాత్రి 12 గంటలకి హీరో నుండి ఫోను.సేం రియాక్షన్ నా నుండి తన గొంతు వినగానే.వల వలా ఏడ్చేసా.ఎందుకో తెలీదు.ఏదో దిగులు.మొదటి సారి పుట్టినరోజు నాడు ఏడ్చాను నేను.మరునాడు కాలేజీ కి వెళ్ళాకా కాస్త కుదుట పడ్డాను.ఇక అటూ ఇటూ ఉత్తరాల ఊసులు ప్రవాహం మొదలు.పాపం హీరో ఫోను చెయ్యాలి అంటే వాళ్ళ హాస్టల్ నుండి ఒక 4-5 కిలోమీటర్లు వచ్చి చెయ్యాల్సి వచ్చేదిట.పైగా లైన్లు బిజీ రాత్రి టైం లో. లేదా,మా హాస్టలు ఫోను బిజీ.

ఇన్ని అవాంతరాలు దాటుకుని ఫోను వచ్చింది అంటే ఇక నాకు సంబరమే.కానీ ,"హలో" అన్న దగ్గర నుండీ నాకు, ఎప్పుడు ఇక ఊంటాను అని ఫోను పెట్టెస్తాడో అని టెన్షన్ గా ఉండేది.కానీ హీరో ఇవేమీ లేకుండా హాయిగా మాట్లాడేవాడు.నాకు ఆశ్చర్యం వేసేది.ఒక సారి అడిగాను,నీకు ఫోను పెట్టెయ్యాలి అని బాధ ఉండదా అని.బాధ పడటానికి కాదు కదా ఫోను చేసేది అని ఠకీ మని అక్కడ నుండి జవాబు.

హీరో నుండీ నాకు ఉత్తరాలు డీటీడీసీ కొరియర్ లో వచ్చేవి.కొరియర్ లో వేసిన నాలుగో రోజు నాకు చేరేది ఆ ఉత్తరం.హీరో నాకు ఉత్తరం కొరియర్ లో వేసాను అని చెప్పగానే ఇక రోజులు లెక్క పెట్టుకునేదానిని.నాలుగో రోజు ఉదయం 11.30 కి మా ఊళ్ళో డీటీడీసీ ఆఫీసు కి ట్రైన్ లో చేరేవి ఆనాటి కొరియర్లన్నీ.సో, హీరో ఉత్తరం రాసిన ప్రతీ సారీ నా ఫ్రెండు నాగమణి ని బతిమాలి ఒక్క క్లాసు కి నా అటెండెన్సు ఎలాగో మేనేజ్ చెయ్యమని చెప్పి డీటీడీసీ ఆఫీసుకి వెళ్ళేదానిని.

ఒకోసారి రైలు లేటు అయ్యి కొరియర్ వచ్చేది కాదు.ఏ ట్రైన్ లో వస్తాయి కొరియర్లు,వచ్చాకా ఎన్నింటికి డెలివర్ చేస్తారు వగైరా ప్రశ్నలతో ఆ ఆఫీసు క్లర్కు ని విసిగించేదానిని.ఆ ఆఫీసు క్లర్కు నా సతాయింపు భరించలేక,మేడం, కొరియర్ రాగానే ఫస్టు మీకే డెలివర్ చేస్తాము అని చెప్పేవాడు,అంటే ఇన్ డైరెక్ట్ గా ఇక దయచేయమని.

చేసేది లేక కాలేజీ కీ వెళ్ళేదానిని.క్లాసు కి వెళ్ళినా మనసంతా ఆ ఉత్తరం మీదే ఉండేది.కాలేజీ అవ్వగానే,అలా కాసేపు బేకరీ లో ఒక పఫ్,లేదా పేస్ట్రీ తిని వెళ్ళ్లేవాళ్ళము క్లాసు అమ్మాయిలతో అప్పుడప్పుడు.కానీ కొరియర్ కోసం వెయిట్ చెసే రోజు మాత్రం పరిగెత్తుకుని హాస్టల్ కి వచ్చేదానిని.నేను వెళ్ళిపొతే తను మళ్ళీ ఒక్కర్తే రావాలి అని పాపం నాగమణి కూడా వచ్చేసేది.వస్తున్నంత సేపూ దారిలో ఎన్ని ఆలోచనలో,మా హాస్టల్ లో కొరియర్ ఎవరయిన కలెక్ట్ చేసుకున్నారో లేదో,ఎక్కడ పెట్టారో వగైరాలన్నమాట.

రూము తాళం కూడా తియ్యకుండా మొదట నా కొరియర్ గురించి ఎంక్వయిరీ చేసేదానిని.అది నా చేతిలో పడగానే ఎంత సంబరమో.వరల్డ్ కప్పు పట్టుకున్న కెప్టెన్ మొహం లో కూడా అంత సంతొషం కనపడదేమో.నిజం,ఆ ఆనంద క్షణాలు ఇప్పటికీ నాకు గుర్తే.ఉత్తరం తెరిచి మొదట ఎన్ని పేజీలుందో చూసేదానిని.చెప్పలేదు కదూ,ఉత్తరం అంటే ఏదో నాలుగు పేజీలు కాదు.హీరో నాకు ప్రతీ సారీ ఒక లెటర్ ప్యాడ్ మొత్తం నింపి పంపేవాడు.నేనూ అంతే,తినే తింది,క్లాసు లో జరిగిన విసేషాలు,బేకరీ లో ఫుడ్ తిన్నప్పుడు వచ్చిన కడుపునెప్పి,మా ఇంట్లో విసేషాలు,మా భవిష్యత్తు ఊహలు కాదేవీ ఉత్తరానికి అనర్హం అన్నమాట మా ఉత్తరాలలో.అందుకే అన్నన్ని పేజీలు అలవోకగా నిండి పోయేవి.

ఓకే,కమింగ్ బ్యాక్ టూ నా ఉత్తరం ఓపెనింగ్.ఓపెన్ చెయ్యగానే ఉత్తరం సైజు చూసేదానిని.అలా చూస్తే అదో త్రుప్తి నాకు.హమ్మయ్య ఎక్కువ ఉంది అన్న ఆనందం అన్నమాట.అప్పుడప్పుడు ఉత్తరం తో పాటు చిన్ని చిన్ని బుక్ మార్క్స్ కూడా పంపేవాడు.కానీ ఆ బుక్ మార్క్స్ నన్ను ఎంత డిస్ట్రబ్ చేసేవో నేను పరీక్షలకి చదువుకుంటున్నప్పుడు.బట్ అవే ఒకోసారి ఉత్సాహాన్నిచ్చేవి.

నేను ఉత్తరం తెరిచి చదవటం పూర్తి చెసేటప్పటికి మా ఫ్రెండు హాయిగా టీ తాగి తన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వచ్చి నా కోసం ఎదురు చూస్తూ కూర్చునేది.నెలకి ఒక 4 ఉత్తరాలు అటూ ఇటూ ఎగిరేవి.

ఇలా మొత్తానికి ఉత్తరాలు ఫొను లతో కొన్ని రోజులు గడిచాయి.

Saturday, June 5, 2010

చుయ్ ముయ్ సీ తుం లగ్తీ హో

అలా ఆరోజు తనతో మాట్లాడీ కాలేజీ కి వెళ్ళాను.అసలే కొత్త సబ్జెక్ట్,పైగా అప్పటీకి ఒక 5-6 క్లాసులు అయిపోవడంతో ఏమీ అర్ధం కాలేదు.మరునాడు తనకి ఫోను చెయ్యాలి అన్న కోరిక ని బలవంతంగా ఆపుకుని కాలేజీ కి వెళ్ళాను.కాలేజీ కి మళ్ళా ఒక వారం శలవు ప్రకటించారు.ఎగిరి గంతేసి హీరో ఊరు బయలుదేరా బామ్మ దగ్గరకి.వస్తూ వస్తూ బస్టాండులో ఒక చిన్న బొమ్మ కొన్నాను చిన్న పిల్లాడూ అమ్ముతోంటే.అదే నా ఫస్టు బహుమతి మా శ్రీవారికి.హీరో కి నేను వచ్చాను అని చెప్పలేదు.నేను మధ్యాహ్నం బామ్మ ఇంటికి చేరాను.సాయంత్రం తన గురించి ఆలోచిస్తూ వంటింట్లో ఏదో పని చేస్తున్నా.ఇంతలో ఇటు తిరిగేసరికి గుమ్మంలో శ్రీవారు.ఎంత తత్తరుపాటుకి లోనయ్యానో,ఆ కంగారులో స్టవ్ మీద పాలు పొంగుతున్నాయని పరుగెత్తి గిన్నె దింపబోయి,వేడి పాల గిన్నె చేతితో పట్టుకున్నా.నవ్వొస్తుంది ఇప్పుడు ఆ కంగారు తలచుకుంటే.

ఒక 2 రోజులు గడిచాయి.బజారుకి వెళ్ళి షామైక్ దావర్ ఆల్బం "మొహబ్బత్ కర్లే" క్యాసెట్టు కొన్నాను.కొనడమయితే కొన్నా కానీ ఇవ్వడానికి సంకోచం.నాకు నచ్చిన పాటలు తనకి కూడా నచ్చాలని లేదు కదా.అప్పటికి తెలీదు లెండి,మనము ఇష్టపడే వాళ్ళు యే గిఫ్టు ఇచ్చినా బాగుంటుంది అని,ఎట్లీస్ట్ పెళ్ళికి ముందు :).ఒక ఉత్తరం కూడా రాసా,కానీ భయమేసి చింపేసా ఇవ్వకుండా.ఆ క్యాసెట్టు మాత్రం ఇచ్చి చెప్పాను,ఉత్తరం రాసి చింపేసా అని.ఒకరోజు నేను బామ్మతో హాస్పిటల్ కి వెళ్ళాను.ఇంతలో బాబాయి వచ్చి బామ్మ ని నేను ఇంటి దగ్గర దింపుతా నువ్వూ తమ్ముళ్ళూ ఆటో లో రండి అని ఆటో కోసం చూస్తున్నాడు.ఇంతలో అటు గా వెళ్తున్న హీరో ని పిలిచి,మానస వాళ్ళని ఇంటి దగ్గర దింపుతావా అని అడిగాడు.నవ్వొచ్చింది నాకు,నా కోసమే కదూ అసలు తను అటు వచ్చింది అని.హీరో కి నాకూ మధ్యలో తమ్ముడూ కూర్చున్నాడు.ఇక మొదలు,హీరో సణుగుడు ఆ ఉత్తరం ఇయ్యి అని.లేదూ చింపేసా అంతే వినడే.ఒక పక్క నాకు భయం,తమ్ముడూ వింటాడేమో అని.చాలా బతిమాలాడు పాపం.కానీ అసలు ఆ ఉత్తరం ఉంటే కదా ఇవ్వడానికి.పోనీ ఆ ఉత్తరం ముక్కలయినా ఇయ్యి అంటాడు.ఇంటికి వచ్చేవరకు బతిమాలుతూనే ఉన్నాడు.

మరునాడు మా నాగమణి నుండి ఫోను,కౌన్సెలింగు ఉంది బయలుదేరు అని.హీరో ని కలిసి చెప్పా,నేను వెళ్తున్నా,అక్కడ నుండి మా ఊరు వెళ్తున్నా,మళ్ళీ ఎప్పుడు కలుస్తానో అని.అన్నీ విని,ఆ ఉత్తరం ఇచ్చి వెళ్ళు అన్నాడు.విసుగొచ్చింది నాకు.ఇంతకీ చెప్పలేదు కదూ,నేను ఆ ఉత్తరం రాసి చింపేస్తున్నప్పుడు అటువైపు మా పిన్ని రావడంతో ఆ ముక్కలని అలా నా బ్యాగు లో కుక్కేసా,చూస్తే ఏమిటి అని అడుగుతుందేమో అని.

సో,అలా నా బ్యాగు లో ఆ మొదటి ఉత్తరపు ముక్కలు తీసి చిన్న కవర్ లో పెట్టి ఇచ్చాను.అదీ నా మొదటి ప్రేమ లేఖ కధ.

ఇంతలో నాన్నగారు ఫోను,నేను రానా అమ్మా అని.వాదు,నేను చూసుకుంటా కాలేజీ అదీను.అయిపోగానే బయలుదేరి వస్తా అన్నాను.

మరునాడు భారం గా బయలుదేరి కౌన్సెలింగు కి వెళ్ళాను.నాకు కావాల్సిన కాలేజీ కి సీటు మార్చుకుని మా ఇంటికి బయలుదేరా.సంక్రాంతి పండగ కావడంతో ఇంటికి అక్క వాళ్ళు వచ్చారు.అమ్మ ఏదో పూజ ఉందని చుట్టాలని కూడా పిలవడంతో ఇంటి నిండా చుట్టాలు.మామూలుగా అయితే అసలు హడావిడి నాదే ఉండేది.కానీ ఈ సారి నా ఆలొచనలు అన్నీ హీరో చుట్టోఓ ఉండటంతో సరిగ్గా ఎంజాయ్ చెయ్యలేకపోయాను.అమ్మ అడిగింది,ఏమిటి అలా ఉన్నావు అని కానీ చుట్టాలు,పూజ హడావిడీ లో రెట్టించలేదు.

మా కజిన్ ఒకడు మాత్రం పట్టేసాడు.వాడికి చెప్పా హీరో సంగతి.ఇవన్నీ జరిగేవి కాదు కానీ చదువుకో బాగా అని చెప్పాడు.

పండగ పూజ అన్నీ అయ్యాయి.ఇక నేను బయలుదేరి పాత కాలేజీ హాస్టల్ కి వెళ్ళి నా సామానులు తెచ్చుకోవాలి.కొత్త కాలేజీ కి మారాలి కదా.నాన్న నాతో బయలుదేరారు.ఇంతలో బాబాయి ఫోనుచ్ హేసి,అన్నాయా నువ్వు అంత దూరం నుండి రాకు,నేను చూసుకుంటా అనడంతో ఆగిపోయారు.

చాలా దూరం మా ఇంటి నుండి దాదాపు నా కాలేజీ కి ఒక 15 గంటల ప్రయాణం.మధ్యలో హీరో ఇంటికి ఫోను చేసాను.వాళ్ళ అక్క ఎత్తింది ఫోను.ఠక్కున పెట్టేసా.తరువాత మా కోడ్ అయిన వన్ రింగ్ ఇచ్చి కాసేపటికి చేసాను.వన్ రింగ్ ఇచ్చి కాసేపాగి చేస్తే అప్పటికి మేమే ఫోను దగ్గరకి వచ్చి ఎత్తాలన్నమాట.అదీ కోడ్.

మొత్తానికి హీరో ఫోను ఎత్తగానే నా బస్సు వివరాలు చెప్పాను.వాళ్ళ ఊరి మీదుగానే నా పాత కాలేజీ కి వెళ్ళాలి.బాబాయ్ కి కూడా చేసాను,తనకి ముఖ్యమయిన పని వల్ల ఊరు వెళ్ళాడు అని పిన్ని చెప్పింది.ఇక హ్యాపీ నేను,బాబాయి రావట్లేదు నాతో అని.

మొత్తానికి బస్సు వాళ్ళ ఊరు చేరింది.హీరో తో పాటు ఒక ముసలావిడ కూడా ఉన్నారు.ఆవిడని నా దగ్గరకి తీసుకొచ్చి మా అమ్మమ్మ అని పరిచయం చేసాడు.

నాకు ఒక్క క్షణం భయమేసింది.ఆవిడ ని బస్సు ఎక్కించి వస్తా అని ఇంట్లో చెప్పి,ఆవిడ ని బస్సు ఎక్కించి నాతో బయలుదేరాడు నా కాలేజీ కి. మీ అమ్మమ్మ ఇంట్లో చెప్తే అన్నాను.మామూలుగానే పరిచయం చేసాను,నువ్వు మా ఇంట్లో తెలియక పోతే భయం కానీ అన్నాడు.

హాస్టల్ కి వెళ్ళి నా లగేజీ తీసుకుని మరలా బామ్మ ఒరుకి ప్రయాణమయ్యాము.నా లగేజీ చూసి ఈ పాత బకెట్టు,పరుపు అవసరమా అన్నాడు.నేను వీటిని గత కొద్ది సంవత్సరాలుగా వాడుతున్నా,హాస్టలు మారినప్పుడల్ల ఇవి నాతోనే వస్తాయి,నీకు ఇష్టం లేకపోతే నేను పోర్టర్ కి ఇచ్చి బస్సులో పెట్టించుకుంటా అని చెప్ప.చేసేది లేక,కాం గా వాటిని బస్సులో పెట్టాడు.


ఆడపిల్లలకి తమ వస్తువుల మీద కాస్త ఎక్కువే ప్రేమ అనిపిస్తుంది నాకు.ఠక్కున ఏ వస్తువు ని పారెయ్యలేరు,ఏమంటారు?

మొత్తానికి బస్సు బామ్మ ఊరు చేరింది.బస్టాండు లో దిగి ఎవరి దారిన వారు ఇంటికి వెళ్ళాము.బాబాయి ఇంటికి వచ్చి కుదరలేదమ్మా నీతో రావడం,సారీ అని చెప్పాడు.



మరునాడే నా కొత్త హాస్టల్ కి ప్రయాణం.బామ్మ ఊరు నుండి ఒక గంటన్నర జర్నీ ట్రైను లో.పొద్దున్నే స్టేషన్ కి వచ్చాడు హీరో. తన వాక్ మన్ ఇచ్చి నీ దగ్గర ఉంచుకో అన్నాడు.ట్రెయిన్ బయలుదేరబోతుండగా డెయిరీ మిల్కు చేతిలో పెట్టాడు.తినెటప్పుడు ఒక్కసారి చాక్లెట్టు చూడు అని చెప్పి బాయ్ చెప్పి కదిలాడు.ట్రెయిన్ కదిలాకా చాక్లెట్ రేపర్ విప్పాను."లవ్ యూ" అని చాక్లెట్టు మీద రాసి ఉంది.ప్యాకింగు విప్పి చక్కగా పిన్నుతో రాసి మరలా అలా ప్యాక్ చేసిన తన ఓపిక ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.

నిజం చెప్పొద్దూ,నాకు అంత ఓపిక,క్రియేటివిటీ రెండూ లేవు.నా కొత్త కాలేజీ హాస్టల్ చేరాను అలా ఊహలతో.మా నాగమణి కూడా సేం హాస్టల్.తను అప్పటికే అక్కడకి వచ్చి ఉంది.




రూము సర్దుకుని మొదట నాన్న కి ఫోను చేసాను.తరువాత హీరో కి.

హీరో వాళ్ళ ఫోను డెడ్ అనుకుంటా,ఎవ్వరూ ఎత్తట్లేదు.ఇక నాకు ఉన్న ఏకయిక ఆప్షన్ మా అత్త వాళ్ళింటికి ఫోను చెయ్యడం.కానీ చేసి ఎలా చెప్పేది,హీరో ని పిలవమని?మా నాగమణి తో చేయించా ఫోను.తన పేరు స్వప్న అని చెప్పించి,హీరో ఫ్రెండు ని,తనని ఒకసారి పిలుస్తారా అని అడిగింది.హీరో రాగానే,నా హాస్టల్ నంబరు అదీ ఇచ్చాను.

ఆ రాత్రే హీరో కూడా తన కాలేజీ కి వెళ్ళిపోYఆడు.తను ఉండేది పొరుగు రాష్ట్రంలో.మా ఎస్టీడీ ఫోన్లు రాత్రి 9 తరువాత మొదలయ్యేవి.హాస్టల్ అంటే బోలెడు మంది ఉంటారు కదా,ఎవరయినా ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడితే కోపం వచ్చేది నాకు,హీరో కి లైని దొరకదేమో అని.

అలా మా ప్రేమ కబుర్లు సాగుతూ ఉండేవి.

నన్ను చూద్దామని ఒకరోజు అమ్మ వచ్చింది.హీరో నా హాస్టల్ కి రాసిన మొదటి ఉత్తరం కొరియర్ మా అమ్మ ఉండగానే వచ్చింది.ఎవరు రాసారు ఉత్తరం అని అమ్మ అడిగింది.మా ఫ్రెండు అని చెప్పా.అప్పటికే నేను కొన్ని సంవత్సరాలుగా హాస్టల్ లో ఉండటంతో ఫ్రెండ్సు ఉత్తరాలు అవీ రాసేవాళ్ళు.కానీ అమ్మ ని మోసం చేస్తున్నా అనిపించింది.ఆ రాత్రి అమ్మ ని పట్టుకుని ఏడ్చేసా.ఏమిటమ్మా అంది.చెప్పేద్దామనుకున్నా,కానీ మళ్ళీ హీరో దూరమవుతాడేమో అని భయం.నరకం అనుభవించేదానిని ఇద్దరి మధ్యలో.

ఒక నెలన్నర తరువాత హీరో నుండి కబురు.మీ ఊరు వస్తున్నా అని.పిచ్చి సంతోషం తనని కలుస్తున్నా అని.స్టేషన్ కి వెళ్ళాను.ట్రెయిన్ వచ్చేసింది కానీ హీరో జాడ లేదు.రాలేదా ఏమిటీ అనుకున్నా.కాసేపటికి బయలుదేరా,ఒకవేళ బయటకి వెళ్ళీ ఉంటాడేమో అని.ఇంతలో వెనకనుండి,బయటకి వెళ్దామా అని వినిపించింది.చూస్తే హీరో.

నీ కంగారు గమనిస్తున్నా ఇందాకతటి నుండీ అన్నాడు.బయటకి అయితే వచ్చాము కానీ ఎక్కడకి వెళ్ళాలి?ముందర అయితే బ్రెక్ఫాస్టు చేద్దాము అని బ్రెక్ఫాస్టు చేసాము.మళ్ళీ సేం ప్రశ్న.ఎక్కడకి వెళ్ళాలి అని.నేను అప్పటివరకు ఆ ఊరిలో ఒకే ఒక ప్లేస్ కి వెళ్ళాను.అదే అమ్మ వారి గుడి.తననీ అక్కడికే తీసుకెళ్ళాను.

కాసేపటికి జేబు లో నుండి ఒక చిన్న బొమ్మ తీసి నా డ్రెస్స్ కి పెట్టాడు.అప్పట్లో అబ్బాస్,ప్రీతి జింగ్యానియా ది "చుయ్ ముసీ తుం" అని ఒక ఆల్బం వచ్చింది.ఆ ఆల్బం లో వాడిన ఒక బొమ్మ ఆర్చీస్ లో అమ్మేవారు.అదే తెచ్చాడు.ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉంది.


చుయ్ ముసీ తుం ఇక్కడ చూడండి


పొద్దున్న నుండీ సాయంత్రం వరకూ ఇద్దరమూ గుడి లో వచ్చే పోయే వారిని చూస్తూ ఒక ధంసప్ బాటిల్ తో గడిపేసాము ప్రసాదం కొనుక్కుని.

తను బయలుదేరే టైమయ్యింది.అప్పుడే గడచిపోయిండా టైం అనిపించింది.తనకి సెండాఫ్ ఇచ్చి హాస్టల్ కి బయలుదేరా.

Monday, May 31, 2010

హమ్మయ్యా



మరునాడు పొద్దున్నే ఇంటికి వచ్చి అందరితో పాటూ నన్నూ మామూలుగా విష్ చేసాడు.ఆరోజు న్యూ ఇయర్ కాబట్టి నాకు క్లాసు లేదు. మధ్యాహ్నం,సాయంత్రం వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళాడు.రాత్రి ఫోను కబుర్లు యధా తధం.మరునాడు నాకు క్లాసు కి వెళ్ళాలనిపించలేదు.అన్యమనస్కం గా వెళ్ళొచ్చా.హీరో కూడా కనపడలేదు.ఇంతలో నా ఫ్రెండు ఫోను,క్లాసులు మొదలయ్యాయి,కాలేజీ కి రమ్మని.నా మనసు ఏమీ బాగాలేదు అప్పటికే. పిన్ని కి చెప్పా నేను ఎల్లుండి కాలేజీ కి వెళ్తున్నా అని.సడెన్ గా ఏమయ్యిందే,కాలేజీ మార్చుకునే దాకా వెళ్ళనన్నావు కదా అంది.క్లాసు లు మొదలయ్యాయిట వెళ్తున్నా,వీలున్నప్పుడు మార్చుకుంటా లే అన్నా.నీ ఇష్టం,మీ నాన్న కి ఫోను చేసి చెప్పు అంది.నాన్నగారికి కూడా చెప్పా,సోమవారం వెళ్తున్నా కాలేజీ కి అని.

మరునాడు ఆదివారం.క్లాసు లేదు.హీరో వాళ్ళ నాన్న గారు మా బాబాయి అందరూ ఇంట్లొ ఉండే రోజు.సో,నేను అత్తా వాళ్ళింటికి వెళ్ళినా తనతో మాట్లాడటం కష్టం.కానీ మాట్లాడాలనిపిస్తోంది ఎలాగ?.రేపే కాలేజీ కి వెళ్ళిపోతున్నా,మళ్ళీ తనతో మాట్లాడటం కుదరదేమో అని ఓ పక్క భయం.ఇక ఉండబట్టలేక సాయంత్రం అత్త వాళ్ళింటికి బయలుదేరా,వెళ్ళేసరికి హీరో అక్కడ కనపడగానే బోలేడు ఆనందం.కానీ బోలేడు మంది చుట్టూ,మాట్లాడలేను.అలా అంత మంది మధ్యలో కూర్చుని కూర్చుని కాసేపటికి విసుగొచ్చింది.ఏమిటే అలా ఉన్నావు,దీనికి హాస్టల్ కి వెళ్ళాలంటే ఎప్పుడూ దిగులే అంది అత్త.ఇక లాభం లేదు అని వెళ్తా అత్తా అని లేచాను.కూర్చో కాసేపు,మళ్ళీ ఎప్పుడొస్తావో అంది.నాకు ఉండాలని లేదు,అలా హీరో కళ్ళెదురుగా కనపడుతోంటే నరకం గా ఉంది నాకు.తను కూడా రోజూ లాగ ఉన్నట్లు లేడు అనిపించింది.ఎప్పుడూ నవ్వుతూ ఉందే తను ఏమిటో ముభావం గా అనిపించాడు.ఇంతలో తను నాకు ఒక్కదానికి మాత్రమే వినపడేలా హీరో అన్న మాట,కుర్చీ లో నుండి లేచిన నన్ను మళ్ళీ కూర్చునేటట్లు చేసింది.


ఎనీ గెస్,ఏమనుంటాడో?ఇన్ని సినిమాలు చూసారు కదా,గెస్ చెయ్యండీ.....
.
.
.
.
.
.
.
.
.
.
.


"ఐ నీడ్ యువర్ ప్రెజన్స్"....

ఈ మాట నన్ను కాసేపు అక్కడే కట్టి పడేసింది.కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేసాయి ఆ మాట వినగానే.కాసేపు కూర్చున్నా కానీ మాట్లాడటం కుదరలేదు.ఇక లాభం లేదనుకుని 8 అవుతుండగా లేచాను.నేను దింపుతా ఇంటి దగ్గర అని తనూ లేచాడు.ఇంతలో అత్త తనకి వెరే పని చెప్పడంతో అదీ వీలు పడలేదు.ఆరోజు ఇంటికి చేరి బాబాయి ఎప్పుడు పడుకుంటాడా అని ఎదురు చూడటమే సరిపోయింది.రేపు వెళ్తున్నావుట కదా అన్నాడు,భోజనం చేస్తుండగా.అవును అన్నాను.నేను రానా అన్నాడు.వద్దులే,వెళ్ళగలను,దగ్గరే కదా అన్నాను.పోనీ బస్టాండు కి వెళ్ళేటప్పుడు లేపు అన్నాడు.వద్దు బాబాయ్,ఎందుకు శ్రమ,నాకు లగేజీ కూడా లేదు కదా,వెళ్తాలే,హాస్టల్ కి చేరి ఫోను చేస్తా అన్నాను.ఇలా చెప్పానే కానీ ఒప్పుకుంటాడో లేదో అని సందేహం.భోంచేస్తున్నంతసేపూ ఏమీ మాట్లాడలేదు.చేతులు కడుక్కుంటూ అడిగాడు,వెళ్ళగలవా,మళ్ళీ మీ నాన్న నన్ను కోప్పడతాడు అని.వెళ్తాను,ఇబ్బంది లేదు అన్నాను.హీరో ని బస్టాండు లో కలవచ్చన్న ఆశ కాస్త పెరిగింది.మా బాబాయి బస్టాండు కి వస్తే,తను రాలేడు కదా,ఎంత ఫ్రెండు అయితే మాత్రం అంత పొద్దున్నే నా కోసం వస్తే.......

మొత్తానికి బాబాయి పడుకున్న కాసేపటికి ఫోను కబుర్లు మొదలు. ఈ సారి ఎందుకో మామూలుగా అనిపించలేదు నాకు తన మాటలు.అలా తెల్లవారుఝాము మూడింటి వరకు మాట్లాడుకున్నాము.ఇక 2-3 గంటలే టైముంది.ఇక ఆగలేకపోయాను నేను.

ఐ కెనాట్ స్టే వితవుట్ యూ" అని చెప్పి ఏడ్చేసా.ఆరు సంవత్సరాలనుండీ నేను అనుభవిస్తున్న క్షోభ అంతా చెప్పి తనివితీరా ఏడ్చేసా.

తను ఒప్పుకుంటాడా లేదా అని కూడా ఆలోచించలేదు.అసలు ఏమీ ఆలోచించకుండా ఎంత తెలిసున్న అబ్బాయి అయితే మాత్రం అలా ఎలా చెప్పానో అని ఇప్పుడనిపిస్తుంది. "ఏడవకు అలాగ","ఓకే అయాం విత్ యూ", ఇలాంటి మాటల్తో ఇంకో 2 గంటలు గడిచాయి.

ఇంతలో నేను లేచి బయలుదేరాల్సిన సమయమయింది.అలా ట్రాన్స్ లో ఉన్నట్లు లేచి రెడీ అయ్యి బస్టాండుకి చేరా.తను వచ్చాడు.నాకు ఏమో కళ్ళ నీళ్ళు ఆగట్లేదు.ఏమిటో తెలీని దుఖ్ఖం.నేను జీవితం లో అలా ఏడవటం మొదటి సారి చివరి సారి కూడా.ఏమిటి ఇలా బేల గా అయిపోయావు అన్నాడు.నాకూ ఆశ్చర్యం గానే ఉంది నేను ఇలా ఏడుస్తున్నానంటే అన్నాను.

ఇంతలో బస్సు రావడం తో ఎక్కి కూర్చున్నా.పెద్ద రష్ లేదు బస్ లో.ఒక కిటికీ పక్క సీటు తీసుకుని అలా మా కాలేజీకి చేరేవరకు నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.హాస్టల్ కి వెళ్ళా.అక్కడ నా ఫ్రెండు నాగమణి వెయిటింగ్.ఏమిటి మానసా అలా ఉన్నావు అంది.ఏమీ లేదు,హాస్టల్ కి వచ్చా కదా అందుకే అన్నా.అదేంటి నీకు అలవాటే కదా 5 సంవత్సరాలనుండీ,నువ్వే అలా అయిపోతే,నేను మొదటి సారి హాస్టల్ కి వచ్చా,నేను ఎలా అంది.నేను ఏమీ మాట్లాడకుండా రూం సర్దుకోవడం లో మునిగిపోయా.హీరో గురించి మాత్రం చెప్పలేదు.కాసేపటికి అడిగా,నేను ఫోను చెయ్యాలి,వస్తావా అని.ఏమనుకుందొ బయలుదేరింది.దారిలో మొత్తం చెప్పేసా.షాక్ తను.ఏమిటే నువ్వు,అని.నా వల్ల కాలేదు,అందుకే ఆ అబ్బాయికి చెప్పేసా అన్నాను.నీ ఇష్టం,చిన్న పిల్లవి కాదు నువ్వు అంది.


హీరో కి కాల్ చేసా.ఎంత షేపు మాట్లాడానో తెలీలేదు.కాసేపటికి తను అన్నాడు,నువ్వు పెట్టేయి,ఆ ఎస్టీడీ బూతు వాడీ నంబర్ తీసుకో నేనే చెస్తా అని.ఆ షాపతన్ని అడగ్గానే,ఇన్ కమింగ్ చార్జ్ చేస్తా అన్నాడు.ఎంత అని అడిగా,నిమిషానికి రూపాయి అన్నాడు.సరే అన్నాను.ఇక మొదలు మేము టెలిఫోను డిపార్ట్ మెంటు ని మేపడం.ఆరోజు ఫోనులో చెప్పాడు,నువ్వు ఇలా బేల గా అవ్వడం బాలేదు.కాస్తం కుదుట పడు ముందు.నేను నీతోనే ఉంటాను,బాగా చదువుకో,పెద్ద మామయ్య(మా నాన్నగారు)ఎంత హోప్స్ తో నిన్ను పీజీ జాయిన్ చేసారో తెలుసు కదా.ముందు చదువుకో.ఇలా ఇలా మా మాటల ప్రవాహం ఒక గంట సాగింది.పాపం అంత సేపూ మా నాగమణి అలా బయట దిక్కులు చూస్తూ నిల్చుంది.

ఆఖరున ఫోను పెట్టేసే ముందు చెప్పాడు,నువు నాకు రేపు ఫోను చెయ్యకు.బాగా సెన్సిటివ్ గా ఉన్నావు.నేనే మీ హాస్టల్ కి ఒక 3 రోజులు ఆగి చేస్తాను అని.అస్సలు ఒప్పుకోలేదు ముందు నేను.కానీ ఒప్పించాడు చివరకి.

( అసలు కధంతా ఇక్కడనుండే మొదలు...హాయిగా కొన్నాళ్ళపాటు అటూ ఇటూ ఎగిరిన ఉత్తరాలు,ఫోను కబుర్లూ,కొన్ని రోజులకి ఇంట్లో తెలియడం......)