Friday, September 24, 2010

మా ఆర్టీసీ యాత్రలు



ఆశ్చర్యమేస్తుంది అప్పుడు రాసుకున్న ఉత్తరాలు చూసుకుంటే :). పేజీలు పేజీలు నిండి పోయేవి ఈజీగా. అదే ఇప్పుడు రాయమంటే ఒక్క పేజీ మించి రాయలేనేమో. అయినా అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటాము. ఉత్తరాలలోని మధురానుభూతే వేరు కదా.

కానీ ఈ ఉత్తరమే నా జీవితాన్ని ఒక్క కుదుపు కి గురిచేస్తుంది అని మాత్రం ఊహించలేకపోయాను. ఎంత పెద్ద దొంగయినా చిన్న తప్పు చేస్తాడన్నట్లు మేము మా ఉత్తరాలు,గ్రీటింగు కార్డులని ఎవరి కంటా పడకుండా చాలా కష్ట పడి దాచాము. ఇద్దరమూ హాస్టలే కాబట్టి పెద్ద ఇబ్బంది వచ్చేది కాదు. కానీ ఒక సంవత్సరం తరువాత అజాగ్రత్తో,నిర్లక్ష్యమో మరోటో కానీ మాకు గాట్ఠి ఎదురు దెబ్బ తగిలింది. ఆ వివరాలు మరలా ఇస్తాను.

ఇలా ఒక సంవత్సరం గడిచింది. ఉత్తరాలు, మధ్య మధ్యలో నేను వాళ్ళ ఊరు వెళ్ళడం(బామ్మని చూసే వంకతో),లేదా శెలవలకి వచ్చినప్పుడు తనే నేను చదువుకుంటున్న ఊరు రావడం జరిగేది.


నేను చదువుకునే ఊరిలో ఇద్దరము కూర్చుని మాట్లాడుకునే స్థలాలు ఏమీ ఉండేవి కాదు. మన ఊర్లలో పార్కుల సంగతి తెలుసు కదా ఎలా ఉంటాయో. మేము ఎప్పుడూ కూర్చునే గుడి లో రినోవేషన్ జరుగుతుండటంతో మా అడ్డా మార్చాల్సి వచ్చింది.ఎక్కడ కూర్చోవాలో పాలుపోయేది కాదు. ఇలా మీమాంసలోనే ఒకరోజు ఆటో లో బస్టాండు వైపు నుండీ వెళ్తొంటే ఒక అవిడియా వచ్చింది. బస్సెక్కి కూర్చుంటే అని.


వచ్చిందే తడవుగా సెమీ లగ్జరీ టైపు లో కనపడిన బస్సు ఎక్కాము. మహా అయితే ఒక 2 గంటలు ప్రయాణం ఉంటుందిలే అనుకున్నా.నేనూ ఆ ఊరికి కొత్తే.చుట్టు పక్కల ఏవో 3-4 ఊర్ల పేర్లు తప్ప మిగతావి తెలీదు. బస్సు కదిలాకా రెండు గంటలు 3 గంటలు అవుతుందే కానీ గమ్యం రాదే. నాకు టెన్షన్ మొదలయ్యింది.

ఒక 4 గంటలకి అడవులలో ఉన్న ఒక ఊరిలో ఆగింది బస్సు. అదే ఊరుట. బస్సులో అందరూ దిగిపోయారు. ఇదే చివరి స్టాపు సార్,దిగరా అని డ్రైవర్ అరిచేసరికి నా పై ప్రాణం పైనే పోయింది. గట్టిగా ఒక 100 ఇళ్ళు లేవు ఊరిలో. అసలు బస్టాండే లేదు. ఒక చెట్టు కింద బస్సాపేసరికి ఇక నా టెన్షన్ చూడాలి,ఇప్పుడు వెనక్కెళ్ళడం ఎలా అని. ఏడుపొచ్చేసింది. పాపం హీరో పరిస్థితి చూడాలి,ఏదో తెలీని ఊరు,పక్కన ఏడుపు మొహంతో అమ్మాయి :)

డ్రైవర్ కి తెలిసినట్లుంది మేము ఇక్కడ కాదు దిగాల్సిందని. మళ్ళీ ఒక అరగంటలో వెనక్కి బయలుదేరుతుంది అనేసరికి కాస్త రిలీఫ్ నాకు. సరే,అని అలా బస్సు దిగి కిందకెళ్ళి ఏవో నాలుగు బిస్కట్లు కొనుక్కుని మళ్ళీ ఎక్కి కూర్చున్నాము. ఊరిలో అందరూ మమ్మల్ని చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేను నేను.

అలా మరలా ఒక నాలుగ్గంటలు వెనక్కి ప్రయాణం చేసి మా ఊరొచ్చాము. సాయంత్రం ట్రైన్ కి హీరో వెళ్ళిపోతొంటే సేం ఫీలింగ్,అప్పుడే రోజయిపోయిందా అని.

రూం లో పాపం మా రూమ్మేటు టెన్షన్,బయటకి వెళ్టే కనీసం ఒక్కసారయినా హాస్టల్ కి ఫోను చేసే దానిని,అలాంటిది ఐపు లేకపోయేసరికి ఆరోజు. అప్పుడూ సెల్ఫోనులు లేవింకా మరి. పబ్లిక్ బూత్ నుండి చెయ్యడమే. బస్సెక్కి నాలుగ్గంటలు కూర్చుంటే ఫోను ఎలా మరి? అదే విషయం చెప్పాను. జాగ్రత్త మానసా అని మాత్రం అంది. సెల్ఫోనులు,ఈ మెయిల్సు ప్రాచుర్యం పొందని కాలంలో ఈ కధ నడచినా కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తే అప్పుడే బాగుందనిపిస్తుంది.

మా క్లాస్మేట్స్, కాలెజ్ మేట్స్ కంటా పడకుండా ఈ బస్సు జర్నీ ఐడియా బాగుందనిపించింది. అందుకని నా చదువయ్యేంతవరకూ మా అడ్దా ఆర్టీసీ బస్సులే. హీరో వచ్చిన రోజు, పొద్దూన్నే ఏదో ఒక బస్సెక్కడం,మరలా అదే బస్సులోనో నెక్స్ట్ బస్సులోనో వెనక్కి రావడం అన్నమాట.


ఒకరోజు ఒక ఊరిలో అనుకోని బందు వల్ల కంటిన్యూస్ గా 19 గంటలు ప్రయాణం చేసామనుకొండి,అది వేరే సంగతి. ఆ ప్రయాణం తలచుకుంటే నవ్వొస్తుంది ఇప్పటికీ.ఒక 1-2 వేల వేల కిలోమీటర్లు ఈజీ గా RTC బస్సుల్లో తిరిగుంటాము మా పెళ్ళయ్యేంతవరకు.


మెల్లిగా నా ప్రేమ కధ విషయం మా క్లాసులో కూడా తెలిసిపోయింది.

మా ఫ్రెండు ఒకసారి మా జిల్లా మ్యాప్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఇదెందుకు అన్నాను. నీకు రూట్ మ్యాప్ ఇది,యే ఊరు ఎక్కడుందో తెలీడానికి అనేసరికి నవ్వాగలేదు నాకు. హీరోని కలిసిన మరునాడు కాలేజీ కి వెళ్తే మా ఫ్రెండ్స్ బ్యాచ్ జంధ్యాల సినిమాలో సుత్తి వీర భద్ర రావు లాగ ఊర్ల పేర్లు వరస బెట్టి చెప్పేవారు. యే యే పొర్లు వెళ్ళవో నిన్న ,చెప్పు మరీ అనేవారు. నిజం చెప్పొద్దూ ఒకోసారి హీరోకీ అమ్మ నాన్నలకి మధ్య నలిగిపోయేదానిని.


నాసంగతి మా కాలేజీ లో కూడా తెలిసింది. నలుగురి నోటిలో నానకుండా ఉండటానికి గోప్యం గా ఉంచాలని ప్రయత్నించా కొన్నాళ్ళు,కానీ ఎన్నాళ్ళు దాచగలము నిజాన్ని?. అఫ్ కోర్స్,ఇదే నన్ను మా సీనియర్ల ర్యాగింగు నుండీ తప్పించిదనుకోండి.


నేను ఆల్రెడీ ఎంగేజ్డ్ అని తెలిసి మిగతా అమ్మాయిలంత నన్ను పెద్దగా పట్టించుకోలేదు మా కాలేజీలో. మా ఫ్రెండ్స్ వెనకాల పడ్డట్లు నా వెనక ఎవరూ పడలేదు.ఇదో ప్రివిలేజ్ అన్నమాట. ప్రివిలేజ్ అని సరదాగా ఇప్పుడంటున్నా కానీ నాకు తెలుసు మా రెండూ కుటుంబాలు ఎంత క్షోభ అనుభవించాకా ఇప్పుడు హ్యాపీ గా ఉన్నాయో.


ఒక్కటి మాత్రం చెప్పగలను,నేను ఇష్టపడ్డ వ్యక్తి నన్ను సొంతం చేసుకునేందుకు నా కంటే ఎక్కువ కష్టపడ్డాడు.

అలా అని మేమేదో ఇప్పుడు ఐడియల్ కపుల్ అనుకోకండి. మా కీచులాటలు,అలకలు మామూలే. అసలు ఇప్పుడు ఇవన్నీ తలచుకుంటే నవ్వొస్తుంది. అప్పట్లో ఉద్యోగం తెచ్చుకుని పెళ్ళి చేసుకోవడమే పెద్ద చాలెంజ్ అన్నట్లుండేది. అసలు ఛాలెంజిలు అన్నీ ఆ తరువాతే అని ఇప్పుడు తీరికగా తెలిసింది.

మా ఇద్దరి తల్లి తండ్రుల ఆశీర్వాదం,అండ దండలతో ఇనీషియల్ హిక్కప్స్ అన్నీ అధికమించగలిగలిగి ఇప్పుడు ఒక గౌరవనీయమయిన జీవితం గడుపుతున్నాము.