Thursday, July 29, 2010

ఛిట్టీ ఆయీ హై
హాస్టల్ కి వచ్చానే కానీ మనసంతా ఏదో దిగులు.మరునాడు నా పుట్టినరోజు.రాత్రి 12 గంటలకి హీరో నుండి ఫోను.సేం రియాక్షన్ నా నుండి తన గొంతు వినగానే.వల వలా ఏడ్చేసా.ఎందుకో తెలీదు.ఏదో దిగులు.మొదటి సారి పుట్టినరోజు నాడు ఏడ్చాను నేను.మరునాడు కాలేజీ కి వెళ్ళాకా కాస్త కుదుట పడ్డాను.ఇక అటూ ఇటూ ఉత్తరాల ఊసులు ప్రవాహం మొదలు.పాపం హీరో ఫోను చెయ్యాలి అంటే వాళ్ళ హాస్టల్ నుండి ఒక 4-5 కిలోమీటర్లు వచ్చి చెయ్యాల్సి వచ్చేదిట.పైగా లైన్లు బిజీ రాత్రి టైం లో. లేదా,మా హాస్టలు ఫోను బిజీ.

ఇన్ని అవాంతరాలు దాటుకుని ఫోను వచ్చింది అంటే ఇక నాకు సంబరమే.కానీ ,"హలో" అన్న దగ్గర నుండీ నాకు, ఎప్పుడు ఇక ఊంటాను అని ఫోను పెట్టెస్తాడో అని టెన్షన్ గా ఉండేది.కానీ హీరో ఇవేమీ లేకుండా హాయిగా మాట్లాడేవాడు.నాకు ఆశ్చర్యం వేసేది.ఒక సారి అడిగాను,నీకు ఫోను పెట్టెయ్యాలి అని బాధ ఉండదా అని.బాధ పడటానికి కాదు కదా ఫోను చేసేది అని ఠకీ మని అక్కడ నుండి జవాబు.

హీరో నుండీ నాకు ఉత్తరాలు డీటీడీసీ కొరియర్ లో వచ్చేవి.కొరియర్ లో వేసిన నాలుగో రోజు నాకు చేరేది ఆ ఉత్తరం.హీరో నాకు ఉత్తరం కొరియర్ లో వేసాను అని చెప్పగానే ఇక రోజులు లెక్క పెట్టుకునేదానిని.నాలుగో రోజు ఉదయం 11.30 కి మా ఊళ్ళో డీటీడీసీ ఆఫీసు కి ట్రైన్ లో చేరేవి ఆనాటి కొరియర్లన్నీ.సో, హీరో ఉత్తరం రాసిన ప్రతీ సారీ నా ఫ్రెండు నాగమణి ని బతిమాలి ఒక్క క్లాసు కి నా అటెండెన్సు ఎలాగో మేనేజ్ చెయ్యమని చెప్పి డీటీడీసీ ఆఫీసుకి వెళ్ళేదానిని.

ఒకోసారి రైలు లేటు అయ్యి కొరియర్ వచ్చేది కాదు.ఏ ట్రైన్ లో వస్తాయి కొరియర్లు,వచ్చాకా ఎన్నింటికి డెలివర్ చేస్తారు వగైరా ప్రశ్నలతో ఆ ఆఫీసు క్లర్కు ని విసిగించేదానిని.ఆ ఆఫీసు క్లర్కు నా సతాయింపు భరించలేక,మేడం, కొరియర్ రాగానే ఫస్టు మీకే డెలివర్ చేస్తాము అని చెప్పేవాడు,అంటే ఇన్ డైరెక్ట్ గా ఇక దయచేయమని.

చేసేది లేక కాలేజీ కీ వెళ్ళేదానిని.క్లాసు కి వెళ్ళినా మనసంతా ఆ ఉత్తరం మీదే ఉండేది.కాలేజీ అవ్వగానే,అలా కాసేపు బేకరీ లో ఒక పఫ్,లేదా పేస్ట్రీ తిని వెళ్ళ్లేవాళ్ళము క్లాసు అమ్మాయిలతో అప్పుడప్పుడు.కానీ కొరియర్ కోసం వెయిట్ చెసే రోజు మాత్రం పరిగెత్తుకుని హాస్టల్ కి వచ్చేదానిని.నేను వెళ్ళిపొతే తను మళ్ళీ ఒక్కర్తే రావాలి అని పాపం నాగమణి కూడా వచ్చేసేది.వస్తున్నంత సేపూ దారిలో ఎన్ని ఆలోచనలో,మా హాస్టల్ లో కొరియర్ ఎవరయిన కలెక్ట్ చేసుకున్నారో లేదో,ఎక్కడ పెట్టారో వగైరాలన్నమాట.

రూము తాళం కూడా తియ్యకుండా మొదట నా కొరియర్ గురించి ఎంక్వయిరీ చేసేదానిని.అది నా చేతిలో పడగానే ఎంత సంబరమో.వరల్డ్ కప్పు పట్టుకున్న కెప్టెన్ మొహం లో కూడా అంత సంతొషం కనపడదేమో.నిజం,ఆ ఆనంద క్షణాలు ఇప్పటికీ నాకు గుర్తే.ఉత్తరం తెరిచి మొదట ఎన్ని పేజీలుందో చూసేదానిని.చెప్పలేదు కదూ,ఉత్తరం అంటే ఏదో నాలుగు పేజీలు కాదు.హీరో నాకు ప్రతీ సారీ ఒక లెటర్ ప్యాడ్ మొత్తం నింపి పంపేవాడు.నేనూ అంతే,తినే తింది,క్లాసు లో జరిగిన విసేషాలు,బేకరీ లో ఫుడ్ తిన్నప్పుడు వచ్చిన కడుపునెప్పి,మా ఇంట్లో విసేషాలు,మా భవిష్యత్తు ఊహలు కాదేవీ ఉత్తరానికి అనర్హం అన్నమాట మా ఉత్తరాలలో.అందుకే అన్నన్ని పేజీలు అలవోకగా నిండి పోయేవి.

ఓకే,కమింగ్ బ్యాక్ టూ నా ఉత్తరం ఓపెనింగ్.ఓపెన్ చెయ్యగానే ఉత్తరం సైజు చూసేదానిని.అలా చూస్తే అదో త్రుప్తి నాకు.హమ్మయ్య ఎక్కువ ఉంది అన్న ఆనందం అన్నమాట.అప్పుడప్పుడు ఉత్తరం తో పాటు చిన్ని చిన్ని బుక్ మార్క్స్ కూడా పంపేవాడు.కానీ ఆ బుక్ మార్క్స్ నన్ను ఎంత డిస్ట్రబ్ చేసేవో నేను పరీక్షలకి చదువుకుంటున్నప్పుడు.బట్ అవే ఒకోసారి ఉత్సాహాన్నిచ్చేవి.

నేను ఉత్తరం తెరిచి చదవటం పూర్తి చెసేటప్పటికి మా ఫ్రెండు హాయిగా టీ తాగి తన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వచ్చి నా కోసం ఎదురు చూస్తూ కూర్చునేది.నెలకి ఒక 4 ఉత్తరాలు అటూ ఇటూ ఎగిరేవి.

ఇలా మొత్తానికి ఉత్తరాలు ఫొను లతో కొన్ని రోజులు గడిచాయి.