Thursday, January 6, 2011

మార్చి 20--రెండు విధాలుగా గుర్తుండిపోయే రోజు



XXXX సంవత్సరం మార్చ్ 18. వాళ్ళ ఫ్రెండు పెళ్ళి ఉందని నేను చదువుకునే ఊరొచ్చాడు ప్రదీప్. నేనూ వెళ్ళా ఆ పెళ్ళికి. ఏమిటో గత రెండు రోజులనుండీ మనసులో ఏదో అలజడి గా ఉంటోంది. ఏమిటో తెలీదు.సరేలే,ఎలాగూ ప్రదీప్ కూడా ఊళ్ళోనే ఉంటాడు,బామ్మ ని కూడా చూసొద్దామని బామ్మ వాళ్ళ ఊరు బయలుదేరా.ఇంటికి వెళ్ళగానే ఎవ్వరూ సరిగా పలకరించలేదు. తేడా తెలుస్తోంది నాకు.ఏమిటో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడట్లేదు.

కొంప దీసి విషయం తెలిసి పోలేదు కదా అనిపించి,ఆ, అయినా ఎలా తెలుస్తుంది మా ఉత్తరాలన్నీ మా దగ్గరే భద్రం గా ఉంటే అనుకున్నా. కానీ సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనసు చెప్తూనే ఉంది.నాన్నగారు ఫోను చేసారు,కానీ ముభావం గానే మాట్లాడారు.నేను వస్తున్నాను అనేసరికి గుండెలు జారిపోయాయి.ఎందుకు ఇంత సడెన్ గా అని.

XXXX మార్చ్ 19:నేను బామ్మా వాళ్ళ ఊరొచ్చినప్పుడెప్పుడూ ఇలా లేదు,తనని కలవడమే అవ్వట్లేదు.సాయంత్రం ఆరు గంటలప్పుడు మాత్రం వెంకటేస్వర స్వామి గుడికి వచ్చాడు ఒక్క 10 నిమిషాలు మాట్లాడటానికి. మన విషయం తెలిసిపోయినట్లనిపిస్తోంది,భయమేస్తోంది అన్నాను.ఏమీ కాదు,నేనున్నాను కదా,ధైర్యం గా ఉండు అయినా ఉత్తరాలన్నీ నీ దగ్గర నా దగ్గర క్షేమం గానే ఉన్నాయి కదా అన్నాడు. అవును కదా ఎందుకు అనవసర భయం అనిపించింది. అంతే కానీ 15 రోజుల క్రితం సర్ప్రైజ్ చేద్దామని పంపిన కార్డు,తనకి రాసిన ఉత్తరం వాళ్ళ అక్క చేతిలో పడి ఉంటుందని అప్పుడు ఊహించలేక పోయాను.

ఇంటికి వచ్చానే కానీ మనసంతా ఏదో లా ఉంది.ఆరోజు ని తలచుకుంటే ఇప్పటికీ వణుకే నాకు. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడలేదు ఇంట్లో. మధ్య రాత్రి ఎప్పుడో నాన్న వచ్చారు పాపం అంత దూరం ఉండి ఓ నాలుగైదు బస్సులు మారి.ఎందుకు ఇప్పుడు వచ్చారు అంటే బాబాయి అర్జెంటు గా రమ్మన్నాడు అని చెప్పారు. ఇక కన్ఫర్మ్ అయిపోయింది నాకు మేటర్ లీక్ అని. తెల్లవారు ఝాము దాదాపు నాలుగింటి వరకు నాన్న అడుగుతూనే ఉన్నారు వెనక తులసి కోట దగ్గర మంచం మీద పడుకుని,చిన్నీ నిజం చెప్పు నీకూ ప్రదీప్ కీ మధ్య ఏమీ లేదు కదా అని. లేదు నాన్నగారూ,మంచి ఫ్రెండ్ అంతే అని బుకాయించాను ఎన్ని సార్లడిగినా కానీ. చివరికి ఆయన ఒక్క మాటన్నారు,నాకు తెలుసు నాన్న,నువ్వు అలాంటి పనులు చెయ్యవని, అమ్మ అంటూనే ఉంది,ఎవరితోనో మాట్లాడుతుంటే బాబాయి చూసి రాద్ధాంతం
చేస్తున్నాడేమో అనేసరికి ఏడుపు ఆగలేదు నాకు. కానీ ఆపుకోవడానికి బాత్రూం లో కి వెళ్ళిపోయాను. ఆ నిమిషం లో బయట పడిపోయి ఉన్నా బాగుండేదేమో,మరునాడు ఆయనకి తలవంపులు తప్పించే దానిని. అసలు నేను ఆరోజు పోస్టు చేసిన ఉత్తరం సంగతే మర్చిపోయి,అన్నీ నా దగ్గర భద్రం గా హాస్టల్ గదిలో ఉన్నాయి లే అన్న ధీమాతో నాన్నగారికి చెప్పలేదు. పైగా అప్పటికీ ఇంకా ప్రదీప్ సెటిల్ అవ్వలేదు. నో అంటారేమో అని భయం కూడా నా నోరు పెగలనివ్వలేదు.

తెల్లవారింది. కాఫీలు అవీ తాగాకా ఉదయం ఏడున్నరకి బాబాయి చెప్పాడు,అన్నయ్య పెద్ద బావగారు(మా అత్త వాళ్ళాయన) నీతో ఏదో మాట్లాడాలిట,వాళ్ళింటికి రమ్మన్నారు అని. నా గుండెలో వెయ్యి బాంబులు పేలిన భయం వేసింది నాకు. అత్త వాళ్ళ ఇల్లు మరి ప్రదీప్ వాళ్ళ ఇంటి పక్కనే కదా.

బిక్కు బిక్కు మంటూ నాన్నగారివెనకాలే నేనూ వెళ్ళాను. వెళ్లగానే మమ్మల్ని కూర్చోమని చెప్పి వెళ్ళి మామయ్య ప్రదీప్ వాళ్ళింటికి వెళ్ళారు. నేను అత్త వాళ్ళ గుమ్మం లో నిలబడి అన్నీ చూస్తున్నాను. ప్రదీప్ వాళ్ళ నాన్నగారు ఒక ఉత్తరము,గ్రీటింగు కార్డు ని దాదాపు మామయ్య ముఖం మీదికి విసిరినంత పని చేసారు.అంతే...మామయ్య అదే వేగం తో ఇంటికి వచ్చి ఏమితే ఇది అని నా మీద చెయ్యి చేసుకున్నారు.అంతే,నా దిమ్మ తిరిగిపోయింది. అసలు ఇలా ఎలా జరిగిందో అర్ధంకాలేదు నాకు.ఈ ఉత్తరం వీళ్ళ చేతుల్లో ఎలా అని ఆలోచిస్తున్నంత లోనే నా మీద నాలుగు దెబ్బలు వేసారు. నాన్న ఓ పక్కన అలా షాక్ తిని చూస్తూ ఉండిపోయారు. ఓ పావుగంట పాటు అంతా గందరగోళం.ఏమిటే నువ్వు చేసిన పని అని అత్తయ్యలు,మామయ్యలు అడగడం,అవును నేను ప్రదీప్ ని పెళ్ళి చేసుకుంటాను అని నేను అంతే గట్టిగా చెప్పడం జరిగిన తరువాత అప్పటి వరకు కాం గా ఉన్న నాన్న ఇక నేను బతికి అనవసరం అంటూ,రైలు పట్టాల వైపు బయలుదేరారు. కనీసం ఒక్కరంటే ఒక్కరూ ఆపలేదు బయటకొచ్చి ఆయనని.


నేనే వెనకాల వెళ్ళి ఏడుస్తూ బతిమాలి బామ్మ వాళ్ళింటికి తీసుకురాగానే మరల అక్కడ నా మీద మాటల దాడి మొదలు.
నేను ఇంతలో ప్రదీప్ కి ఫోను చేసానువాళ్ళ అమ్మ తీసి తనకి ఇచ్చారు.ఇక్కడ ఇంత గొడవ జరుగుతోంతే,సార్ ఏమో అప్పుడే అక్కడ నిద్ర లేచారుట."ఆ తెలిసింది" అని మాత్రం అన్నాడు. ఒళ్ళు మండిపోయింది నాకు,అదే సమయం లో చాలా మంది ఆడపిల్లల లాగే నేనూ మోసపోయానా అన్న ఊహే భయంకరం అనిపించింది. అక్కడ మామయ్య కొట్టినా ఇంత బాధ అనిపించ లేదు,బాబాయి,అత్తలు ఎన్ని మాటలన్నా భరించాను కానీ తను ఈ టైం లో వచ్చి అవును ఇద్దరమూ పెళ్ళి చేసుకుందాము అనుకుంటున్నాము అంటాడనుకున్నాను మా ఇంటికి వచ్చి. ఒక్కసారిగా ఫోను పెట్టేసి ఏడవడం మొదలెట్టాను.నా మీద మాటల దాడి ఏ మాత్రం ఆగలేదు.
ఎవ్వరేమి అంటున్నా,అవును నేను ఇప్పటికీ అదే మాట చెప్తాను ప్రదీప్ ని పెళ్ళిచేసుకుంటాను అని చెప్పడం విన్న బాబాయి కోపం గా నా మీదకి చెయ్యి లేపేసరికి నాన్న గట్టిగా అరచి ఒక్క మాట చెప్పారందరికీ. దాని మీద ఎవ్వరి చెయ్యీ పడటానికి వీల్లేదు. అది నా కూతురు,
నడమ్మా!! బయలుదేరి మన ఇంటికి వెళ్దాము అని చెప్పి 10 నిమిషాలలో నన్ను బస్టాండు కి తీసుకెళ్ళారు.అంతమంది ముందు అంత అవమానం జరిగి కూదా నాన్నగారు ఏమీ జరగనట్లే ఉండి నేను ఎక్కడ సొమ్మసిల్లి పడిపోతానో ఏడ్చి,ఏమీ తినక అని దగ్గరుండి మరీ టిఫిన్ అదీ పెట్టించారు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరాము.

అప్పటికే అమ్మకి విషయం చేరినట్లుంది ఫోను ద్వారా.గుమ్మం లోకి అడుగు పెట్టగానే కయ్యిమంది నా మీద."ఇంత వెధవ పని చేస్తావనుకోలేదు" అని. నాన్నగారు వెంటనే నన్ను లోపలకి తీసుకెళ్ళిపోయి మంచం చూపించి పడుకో అన్నారు.

బట్టలు మార్చుకుంటా అని చెప్పి తలుపు వేసి ప్రదీప్ కి ఫోను చేసాను.వాళ్ల అమ్మ ఎత్తారు."ప్రదీప్! ఆ అమ్మాయి ఫోను అని చెప్పిఇచ్చారు
,నా పేరు కూడా పలకడం కూడా ఇష్టంలేనట్లు.

నేను ఇంటికి వచ్చాను అని మాత్రం చెప్పి ఫోను పెట్టేసా.

తరువాత నాన్న లోపలకి జ్యూసు తాగమ్మా అంటూ వచ్చారు. నాకు ప్రదీప్ కావాలి అంటూ ఏడుస్తూ గ్లాసు ని తోసేసినా కానీ ఏమీ అనలేదాయన.ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే,నాకెప్పుడూ నాన్న అంటే చాలా భయం కోప్పడతారని. కానీ ప్రదీప్ విషయం లో నన్ను ఒక్క మాట కూడా అనని మనిషి మాత్రం నాన్నగారే.

మరునాడు అక్క బావా వచ్చారు పరిగెత్తుకుంటూ. బావగారు, దగ్గర కూర్చోబెట్టుకుని అడిగారు విషయం ఏమిటమ్మా అని. అంతా చెప్పి ఏడ్చేసాను నాకు ఆ అబ్బాయి కావాలి అని.సరే ముందు నువ్వు చదువుకో,ఆ అబ్బాయి కి ఉద్యోగం అదీ రానీ,పైగా వాళ్ళు మన వాళ్ళు కాదంటున్నావు కదా,అన్నీ ఆలోచిద్దాము.నేనున్నాను నీకు అన్న భరోసా ఇచ్చి నేను ఎలాంటి అఘాయిత్యాలూ చెయ్యనని మాట తీసుకుని బయలుదేరారు.


కొసమెరుపేమిటంటే,ఈ సంఘటన జరిగిన మూడేళ్ళకి అంటే XXXXమార్చి 20 న నేను ప్రదీప్ వేద మంత్రాల సాక్షి గా పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటయ్యాము :)

11 comments:

గిరీష్ said...

అదే సమయం లో చాలా మంది ఆడపిల్లల లాగే నేనూ మోసపోయానా అన్న ఊహే భయంకరం అనిపించింది..
thats true to every lady..

final ga..meedhi chala pure love..ee rojullo ila undatamante koddiga thakkuve ani cheppali ammailu and abbailu kooda..
Congrats..and all the best for ur sweet future.
Thanks for a wonderful real love story :-)

Regards,
Girish

Anonymous said...

చాలా బాగావుంది మీ లవ్ స్టొరీ ..,
ఎప్పుడు అంటే అది xxxx మార్చ్ 20 నుండి xxxx మార్చ్ ౨౦., మధ్య లో మూడు years ఏమి జరిగింది...

చెప్పాలంటే...... said...

chaalaa aalasyam gaa cheptunnaru mi love story tondara ga cheppandi please....baagaa cheptunnaru

Anonymous said...

Happy marriage day manasagaru.pradeep gariki kooda wishes cheppandi.pls next tapa kosam chala wait chestunna.tvarga rastaruga.

మానస said...

గిరీష్ గారూ,
మేమేమీ అంత గొప్పవాళ్లము కాదు లెండి.ఎంత బాధ పెట్టామో మా పెద్దవాళ్ళని.మేము పెట్టిన టెన్షన్ కి చక్కగా యంగ్ లుక్ తో ఉండే ఇద్దరి పేరెంట్స్ కూడా కేవలం మూడేళ్ళ వ్యవధి లో పదేళ్ళు మీద పడ్డట్లు అయిపోయారు. ఇప్పుడు ఎవరైనా ప్రేమ, పెళ్ళి అంటే వాళ్ల తల్లి తండ్రులు బాధ పడటం చూస్తే మేమిద్దరము కూడా ఆ పెద్దవాళ్ల తరపునే ఆలోచిస్తాము,ఎందుకో తెలీదు.

మంజు గారూ,
ధన్య వాదాలండీ.రాసెస్తున్నా.

అనానిమస్ గార్లూ,
కామెంటినందుకు,విషెస్ కి ధన్య వాదాలండీ. మీ పేరు రాయచ్చు కదా. ఆ తరువాత ఏముందండీ, ఇంట్లో ఠాఠ్ వీల్లేదనడం,మౌన పోరాటాలు ఎక్సెట్రా ఎక్సెట్రా జరిగి,పెళ్ళయ్యింది ప్రేమ గోల కి శుభం కార్డు పెట్టి పెళ్ళి పుస్తకం ఓపెన్ చేసాము. మామూలే ఇంక అందరి లాగే మేమూను పెళ్ళయ్యాకా బాధ్యతలు,అలకలు,పోట్లాటలు.....అలా సంసార సాగరాన్ని ఈదేస్తున్నాము.

ఇదే ఉంటుంది నెక్స్ట్ టపాలో అంతే. మీకే చెప్తున్నా,ఎవ్వరితో అనకండే :)))

Anonymous said...

ur love story is superb andi

MURALI said...

మీ బ్లాగు ఈ రోజే నేస్తంగారూ పరిచయం చేస్తే చదివాను. నా జీవితంలో నేను ఎన్నో ప్రేమకధలు చూసాను, విన్నాను, చదివాను. ఎందరికో సహాయం చేసాం, కలిపాం. కానీ ఇంత వాస్తవిక సంఘర్షణ మొదటిసారిగా చదువుతున్నాను. మీ ప్రేమకధ నాకు చాలా చాలా నచ్చింది. మీరు అనుభవంచిన ట్రామా నేను ఊహించగలను. ఏదో ఒక దశలో మీ శ్రీవారు ఈ అమ్మాయిని లైట్ తీసుకుందాం ఇంట్లో వాళ్ళు చెప్పింది విందాం అనుకుంటే ఈ కధ మరోలా ఉండేది. మీరు నమ్మిన మీ ప్రేమ కోసం ధైర్యంగా నిలబడ్డారు. అది మంచి విషయం. ఇన్నేళ్ళఫాటు జరిగిన ఈ సంఘర్షణలో చావుని, నరకాన్ని అత్యంత దగ్గరిగా చాలాసార్లు చూసుంటారు. ఈ బాధ కంటే చావటం నయం అని చాలాసార్లు అనిపించి ఉంటుంది. అన్నేళ్ళ పాటు పోరాడిన మీ ఓర్పుకి, ధైర్యానికి సలాం చేస్తున్నా.

MURALI said...

పెద్దలని బాధపెట్టాం అనే గిల్టీ ఉంటుంది. కాదనను. పెద్దల వైపు నుండీ కాస్త పెద్దరికం అవసరం. ఇద్దరూ ఇడూ జోడు కుదిరి, కలిసి హాయిగా బ్రతకగలరా లేదా అని చూడాలి. కుల,మతలను పక్కన పెట్టాలి. పెద్దల ఆశిస్సులతో పెళ్ళి జరిగిపోయింది కాబట్టి అవన్నీ పక్కన పెడితే. ఇప్పుడు మీ మీదే భాద్యతే ఎక్కువ ఉంది. మీరు పడ్డ సంఘర్షణకి, చేసిన పోరాటానికి ఒక విలువ ఉండాలంటే మీరు అన్యోన్యంగా ఆదర్శవంతంగా బ్రతకాలి. మీరు హాయిగా ఉంటే మీ భందువుల్లో, స్నేహితుల్లో ప్రేమకి విలువ పెరుగుతుంది. లేకపోతే మిమ్మల్ని ఉదహరణగా చూపి ప్రేమ పెళ్ళికి ఎవరూ మద్దతివ్వరు. స్వచ్చమైన మీ ప్రేమని గెలిపించుకున్నారు. ప్రేమకున్న స్వచ్చతని ఎప్పటికీ ఇలానే బ్రతికించండి. కొంచెం ఎక్కువగా రియాక్టయ్యానేమో. కారణం "సెల్‌ఫోన్ లేని రోజుల్లో ల్యాండ్‌ఫోన్లు, రింగులిచ్చుకొవటాలు, చుయ్ ముయ్ సీ తుం లగ్తీ హో బొమ్మలు, ఆర్టీసి బస్సులో ప్రయాణాలు" ఇవన్నీ చూసినవాడిని అందుకే మీ కధకి బాగా కనెక్టయ్యా, చాలా ఇష్టపడ్డా. మీ ఇద్దరూ జీవితాంతం ఆనందంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నా.

మానస said...

అనానిమస్ గారూ,
ధన్యవాదాలు

మురళి గారూ,

ఎక్కువ రియాక్ట్ అవ్వడం కాదు మీ భావాలని సరిగ్గా చెప్పారు. కానీ పెద్దవాళ్ళు చేసినది తప్పు అని నాకు ఇప్పుడు ఆలోచిస్తే అనిపించటంలేదండీ. నా కజిన్స్ ఎవరైనా ప్రేమ దోమా అంటే నాకెంత కోపం వస్తుందో.

ఒక్కోసారి అనిపిస్తుంది మా శ్రీవారు నన్ను సరిగ్గా చూసుకోకపోయుంటే, మా అత్తగారు నన్ను హింసించి ఉంటే ....మా తల్లి తండ్రుల భయం నిజమయ్యేది కాదా చెప్పండి?

అవునండీ ఆ రోజులు తలచుకుంటే ఎంత బాగుంటాయో ఈ సెల్ఫోనుల గొడవ లేని రోజులు. ఈ పోరాటం ఎన్ని సార్లు విరక్తిగా అనిపించిందో చెప్పలేను. ప్రదీప్ చొరవ వల్లే మా పెళ్ళి జరిగింది అనుకోవాలి.నెక్స్ట్ పార్ట్ లో ఆ వివరాలు రాస్తాను.

ఒక్క మాట మాత్రం నిజమండీ పోరాటమంతా మా శ్రీవారే చేసారు.

మీరు చెప్పినది కరక్టే,మాకు ఎప్పుడూ కత్తి మీద సామే. గొడవ పడినా పెద్దవాళ్ళకి చెప్పలేము. ఆ దేవుడి దయ,మా పేరెంట్స్,మీ లాంటి వాళ్ళ విషెస్ తో చల్లగా ఉన్నాము.

నా బ్లాగు పరిచయం చేసిన నేస్తం గారికి ధన్యవాదాలు.

Anonymous said...

next post eppudu manasa garuu plzz..

Unknown said...

good information blog
https://goo.gl/Ag4XhH

plz watch our channel