Saturday, December 10, 2011

ఇదీ సంగతి మరి

మరునాడు నిద్ర లేచాకా ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం. అమ్మ లేచి కాం గా పని చేసుకుంటోంది. నాన్నగారు లేచి మామూలుగానే ఆఫీసుకి బయలుదేరారు. ఇద్దరి వైపు కన్నెత్తి చూడాలంటే గుండెలు అదిరిపోతున్నాయి నాకు. తప్పుచ్ హేసిన భావన వెంటాదుతోంది.

సాయంత్రం ప్రదీప్ నుండి ఫోను. నాన్నగారు రిసీవ్ చేసుకున్నారు. చిన్నప్పటినుండీ నాన్నగారిని పెద్ద మామయ్యా అని పిలవడం ప్రదీప్ కి అలవాటు. "పెద్ద మామయ్యా నేను ప్రదీప్ ని, ఫలానా ఊరి దగ్గర ఉన్నాను మీ ఊరికి వస్తున్నాను ప్లీజ్ కోప్పడకండి" అన్నాడు.

అంతే నాన్న కయ్యిన లేచారు తన మీద.ఆయన అప్పుడన్న మాటలు తలచుకుంటే నవ్వొస్తుంది ఇప్పుడు.నీకే తాడూ బొంగరం లేదు నీకు మానస కావాలా అన్నారు. లోపల నుండి వింటున్న నేను షాక్. మొట్టమొదటి సారి ఆలోచించాను ఇక మా కధ ఇంతేనా అని.

తుఫాను ఎన్ని రోజులుంటుంది.ఒక నాలుగైదు రోజులకి కాస్త తేరుకుని అమ్మ కి పని లో సాయం చెయ్యడం నాన్నగారికి అవీ ఇవీ అందివ్వడం చేస్తూ రొటీన్ లో పడ్డాను.ఎంత కాని పని చేసావే అంటూ అమ్మ మధ్య మధ్య లో అంటూనే ఉండేది. ఒకోసారి దుఖ్ఖం తట్టుకోలేక ఏడ్చేసేది.తను అలా బాధపడుతోంటే నాకు కోపం వచ్చేది కానీ ఇప్పుడు తెలుస్తోంది తల్లి హ్రుదయం అంటే ఏమిటో.

అప్పుడు ఇంటర్నెట్టూ అదీ ఇంత విరివి గా వాడకం లేదు. సో, నో కాంటాక్ట్ ప్రదీప్ తో.

ఒక పది రోజుల తరువాత అమ్మ అడిగింది నాన్నగారిని నన్ను కాలేజీ కి పంపి చదువు కంటిన్యూ చేయించమని. నాన్నగారికి అస్సలు ఇష్టం లేదు అని తెలుస్తూనే ఉంది. ఇంత జరిగాకా ఏ తండ్రి అయినా ఎలా ఒప్పుకుంటాడు? మొట్టమొదటిసారి అమ్మ నాన్నగారితో గట్టిగా మాట్లాడింది. చదువు మధ్యలో మానిపించి ఏమి చేస్తామూ అంటూ.

అసలు ఇంక ప్రదీప్ ని కలవను అని గట్టిగా చెప్పి హాస్టల్ కి వచ్చాను.రాగానే మా ఫ్రెండు నవీన్ తో ప్రదీప్ వాళ్ళింటికి ఫోను చేయించి నేను మాట్లాడాను. మరునాడే నన్ను చూడటానికి వస్తాను అని తను పట్టుపడితే , అస్సలు రావద్దు కనీసం నీతో మాట్లాడతాను అనుకోలేదు, ఇలా చాలు అని నేను సర్ది చెప్పాను.

మార్చి ఇరవై సంఘటన నాలో ఎంత భయాన్ని నింపింది అంటే అసలు తనని కలవాలి అంటేనే భయపడేంతగా.

ఒక వారానికి చెప్పాపెట్టకుండా వచ్చేసాడు.రావద్దు అని అంటూనే ఉన్నాను కానీ తనని చూడగానే గట్టిగా ఏడ్చేసి సహజ సిద్ధమైన ఆడపిల్ల ఉక్రోషంతో అడిగాను ఆరోజు అంత గొడవ జరుగుతోంటే ఎందుకు రాలేదు, ఎంత నరకం అనుభవించానో నీకేమి తెలుసు అంటూ.

ఒక 2-3 నెలలకి కాస్త కుదుటపడ్డాను.ఇంటికి మామూలుగా వెళ్ళివచ్చేదానిని శలవలకి. కానీ నాన్న కాస్త స్ట్రిక్ట్ అయ్యారు నా విషయం లో.అంతవరకూ ఎప్పుడూ నాకోసం ఎవ్వరు ఫోను చేసినా కానీ ఎందుకు ఫోను చేసావు అని అడగని నాన్న ఎవ్వరు ఫోను చేసినా తనే రిసీవ్ చేసుకునేవారు.వివరాలు అడిగి కానీ నాకు ఇచ్చేవారు కాదు. నా మీద నమ్మకం పోయింది అన్న ఊహ బాధించేది.కానీ ప్రదీప్ ని వదులుకోలేను నాన్న ని బాధపెట్టలేను.

ఒకసారి అలా శలవలలో ఇంటికి వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్ నవీన్ ఫోను చేసాడు.అప్పట్లో ఫోను చాలా ఖరీదైన వ్యవహారం.ఎస్టీడీ కాల్స్ అన్నీ 9 తరువాతే.

నాన్న ఫోనెత్తారు. నేను నవీన్ అండీ అన్నాడు పాపం."అయితే ఏంటి" అన్నారుట నాన్నగారు.(ఈ విషయం నేను కాలేజీ కి వెళ్ళాకా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు నవీన్. ఎవ్వరూ మానస ఇంటికి ఫోను చెయ్యకండీ అంటూ)

ముందు సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయండీ. తను కాలేజీ 3rd అని చెప్పాడు. అయినా నాన్న కి నమ్మకం కలుగలేదు.నాకివ్వకుండా తనే మార్కులు నోట్ చేసుకున్నారు.

నాకయితే పట్టరాని ఆనందమనిపించింది రిజల్ట్స్ చూడగానే.ఇంట్లో అంత పెద్ద గొడవ తరువాత జరిగిన పరీక్షలవి. ఎంత పట్టుదలగా చదివానో.చాలా నెలల తరువాత నాన్న మొహం లో చిన్న ఆనంద రేఖ చూసాను. కుక్క తోక సామెత లాగ ఇలాగే చదివేసి మార్కులు తెచ్చుకుని ఉద్యోగం సంపాదించేసి నాన్నని ఒప్పించెద్దాము అనిపించేది.

అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే పాఠాలెప్పుడు నేర్చుకుంటాము?ప్రదీప్ చదువు పూర్తి కాగానే ఉద్యోగం రాలేదు. నాకేమో అక్కడ నుండీ ఇక్కడనుండీ సంబంధాలు వస్తున్నాయి.

నా ఒత్తిడి తట్టుకోలేక తన ఫ్రెండు చేస్తున్న వ్యాపారం లో భాగస్వామి అయ్యాడు. అదీ అచ్చి రాలేదు మొదట్లో.

కొన్ని రోజులకి పుంజుకున్నాడు. నాకూ కాలేజీ లో ఉద్యోగం వచ్చింది.కానీ ఎక్కడా ఇంట్లో ఒప్పుకుంటారన్న ఆశ మాత్రం కనపడేది కాదు.

నా చదువు పూర్తయ్యెముందోసారి అయ్యాకా ఇంకోసారి నాన్న అనారోగ్యం పాలయ్యారు. సినిమాలలో చూపించినట్లే డాక్టరు గారేమో ఆయనని టెన్షన్ పెట్టకండి అని చెప్పారు.ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి చూసాకా నాన్నతో ఇలా చెప్పాలి అని అప్పుడప్పుడు మనసులో రిహార్సెల్స్ వేసుకున్న మాటలు కూడా పెగిలేవి కాదు.

ఏడాది గడిచింది.ఇద్దరి ఇంట్లో ఒప్పుకుంటారన్న ఆశ ఏ మాత్రం కనపడేది కాదు. ఇది జరిగే పని కాదు అనుకుని ఇక ప్రదీప్ కి చెప్పేసాను విడిపోదాము అని.అప్పట్లో Toefel,GRE ఓ పెద్ద సవాలు(ఇప్పటికీ ఇదే ట్రెండ్ ఉందేమో తెలీదు).నా మానాన్న నేను చదువుకుంటాను ఇక అని చెప్పాను.మొండి ఘటం ఒప్పుకుంటాడేమిటి ఒక్క పటాన.


నువ్వు ఇలా మాట్లాడితే నేనే వెళ్ళి పెద్ద మామయ్యతో మాట్లాడుతాను అన్నాడు.అంతే,భయమేసేది నాకు.మళ్ళీ ఆయన నారోగ్యం ఎక్కడ తిరగబెడుతుందో అని.అంతే మళ్ళీ కధ మొదటికే. విషయం అలా నానుతూ వచ్చింది.

ఇంతలో మా అక్క నాన్నగారిని ఒప్పించింది వెళ్ళి ప్రదీప్ వాళ్ళింట్లో మాట్లాడేటట్లు.

నాన్నగారు వాళ్ళు అక్కడకి వెళ్ళకముందే ప్రదీప్, నాన్నగారిని కలిసాడు. ఇంతకముందు కలవడం వేరు ఇప్పుడేమో కాబోయే అల్లుడి హోదా :).

నాన్న తనని అక్కా వాళ్ళింట్లో పరిచయం చేసారు.కట్న కానుకల ప్రసక్తే తేవద్దు ఆ మాటలు ఎక్కడికో దారి తీస్తాయి అని తను చెప్పగానే ఎంత సంతోషమేసిందో. నాన్న తనకి ఉన్నదంతా మా మీఅదే వెచ్చించారు. .

అమ్మ వాళ్ళు వెళ్ళారు. మొదట్లో కాస్త ఏవో కాస్త చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అందరూ కలిసి మార్చి 20 న ముహుర్తం నిర్ణయించారు.
మా పెళ్ళి కీ నిశ్చితార్ధానికీ మధ్యలో 15 రోజులు మాత్రమే వ్యవధి. అఫీషియల్ గా కన్ ఫర్మ్ అయ్యింది కదా అని నన్ను బయటకి తీసుకెళ్తానని ప్రదీప్ అంటే నాన్న ఒప్పుకునే వారు కాదు.

ఠాఠ్ ఈ పెళ్ళికి మేము రాము అని నాన్న తరపు వాళ్ళు భీష్మించుకు కూర్చున్నారు.అక్క బావగారే అన్నీ తామై పెళ్ళి జరిపించారు. అసలు పెళ్ళి ఎంత బాగా జరిగిందో.

అసలు కధ ఇప్పుడే మొదలయ్యినంది.ప్రదీప్ వ్యాపారం దెబ్బతింది. విపరీతమైన టెన్షన్.ఒక తొమ్మిది నెలలు నరకం అనుభవించాము.

దేవుడి దయ వలన ఒక ఆసరా దొరికింది. దానిని ఆలంబన గా చేసుకుని ప్రదీప్ అంచెలంచలుగా ఎదిగి ఒక మంచి స్థానం లో ఉన్నాడిప్పుడు.మళ్ళీ వ్యాపారం జోలికి పోలేదెప్పుడూ.

ఇరు కుటుంబాలవారూ ఇప్పుడూ హ్యాపీ. అసలు మాకే గుర్తు లేదు ఇంత కధ జరిగిందా అని.కుటుంబ బాధ్యతలతో బిజీ బిజీ.

మధ్య మధ్య లో అలకలు పోట్లాటలు మామూలే. ఇద్దరమూ సమ ఉజ్జీలము కాబట్టి పోట్లాటలు బాగానే జరిగేవి మొదట్లో.సమయం గడిచే కొద్దీ మెచ్యూరిటీ పెరిగింది ఇద్దరికీ.

ఎప్పుడైన మేము కలిసి తిరిగిన ప్రదేశాలు చూసినా వాటి గురించి విన్నా మనసు అలా అలా తేలి ఎక్కడికో వెళ్ళిపోతుంది.

ఇదండీ సంగతి.దాదాపు 2 దశాబ్దాలక్రితం మా అత్త కూతురి పెళ్ళి లో క్రికెట్ ఆడుతోంటే వన్ సైడెడ్ గా మొదలైన ప్రేమ కధా కమామీషూనూ.ఈ చివరి భాగం ఇంట్రస్టింగా రాయలేకపోయానేమో అనిపిస్తోంది,ఏమంటారు?

మర్చిపోయాను చెప్పడం,ఇద్దరి హాస్టల్ చదువులూ పూర్తయ్యాకా ఇద్దరి దగ్గరా ఉన్న ఉత్తరాలు ఎక్కడ పెట్టాలి అన్న సమస్య వచ్చింది. వాటిని ఒక సూట్ కేసు లో పెట్టి తాళం వేసి ప్రదీప్ తన ఫ్రెండు వాళ్ళింట్లో అటక మీద పడేసాడు.పెళ్ళయ్యాకా ఒక నిధి ని తెచ్చుకున్నట్లు దానిని తెచ్చుకున్నాము.

ఒక్కటి మాత్రం నిజం అప్పుడు రాసుకున్న ఉత్తరాలు ఇప్పుడు చూస్తే నవ్వొస్తుంది.

నా బ్లాగు చదువుతున్న అందరికీ ధన్యవాదాలు. May be this is the last post in this blog. ఎప్పుడైనా రాయాలనిపిస్తే మా ప్రేమ కధ లో,జీవితం లో జరిగిన చెమక్కులు రాస్తుంటాను.

Take care and Wishing you all a very happy new year.